ప్రధాని మోడీ రైతు పక్షపాతి: పీఎంపై బండి సంజయ్ ప్రశంసల వర్షం

ప్రధాని మోడీ రైతు పక్షపాతి అని, పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకున్నారని, ఈ నిర్ణయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బుధవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తంచేశారు.

Update: 2023-06-07 16:56 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రధాని మోడీ రైతు పక్షపాతి అని, పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకున్నారని, ఈ నిర్ణయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బుధవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తంచేశారు. వడ్లకు క్వింటాల్ కు రూ.143 పెంపుతో రైతులకు మేలు జరుగుతుందన్నారు. పత్తి, పల్లి, పెసర్లు, మినుములు, కందుల కనీస ధరను పెంపు సంతోషకరమన్నారు.

యూపీఏతో పోలిస్తే పంటల కనీస ధరను రెట్టింపు చేయడమే బీజేపీ లక్ష్యంగా ఆయన చెప్పుకొచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పత్తి పంటకు రూ.540 నుంచి రూ.640 వరకు, పల్లీలకు రూ.527, పెసర్లకు రూ.803, నువ్వులకు రూ.805, కందులకు రూ.400, మినములకు రూ.350 ధర పెంచడం సంతోషమన్నారు. పెసర్ల కనీస మద్దతు ధరను 10.4 శాతం మేర పెంచి.. క్వింటాల్ కనీస మద్దతు ధర రూ. 8,558గా నిర్ణయించడం హర్షణీయమన్నారు.

ఇదిలా ఉండగా.. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు గరికపాటి మోహన్ రావు, వివేక్ వెంకటస్వామి, ఏపీ జితేందర్ రెడ్డి సైతం ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తంచేశారు. కనీస మద్దతు ధర పెంచిన మోదీ ప్రభుత్వం తమది రైతు పక్షపాత ప్రభుత్వమని మరోసారి చాటుకుందని ప్రకటనలో పేర్కొన్నారు.

ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు. పంట పెట్టుబడిపై యాభై శాతం లాభం వచ్చేలా మోదీ ప్రభుత్వం కనీస మద్దతు ధరను ఎప్పటికప్పుడూ పెంచుతూ వస్తోందన్నారు. ఈ నిర్ణయంతో రైతుల శ్రమకు మరింత ప్రతిఫలం అందుతుందని, ఇది రైతు సాధికారతకు దోహదపడనుందని వారు పేర్కొన్నారు.

Tags:    

Similar News