Bandi Sanjay: గ్రూప్-1 పరీక్షను వెంటనే రీ‌ షెడ్యూల్ చేయాలి.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వెంటనే రీ షెడ్యూల్ చేయాలని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-10-19 09:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వెంటనే రీ షెడ్యూల్ చేయాలని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన నగరంలోని మోహన్‌నగర్‌లోని గ్రూప్-1 అభ్యర్థులను పరామర్శించారు. అనంతరం చలో సెక్రటేరియట్‌కు పిలుపునిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బండి సంజయ్ ర్యాలీని అడుగడుగునా అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలోనే పోలీసుల తీరుపై ఆయన ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ఎలాగైనా సచివాలయం వెళ్లి తీరుతానని బండి సంజయ్ పోలీసులకు సవాల్ విసిరారు. మరోవైపు గ్రూప్-1 అభ్యర్థులు అంతా ఏకమై పోలీసులు.. గో‌‌బ్యాక్ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఇందిరా పార్క్ వద్ద భారీగా అభ్యర్థులు చేరుకోవడంతో ఆ రోడ్డు పూర్తిగా బ్లాక్ అయింది. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం.29 ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఆ జీవోను రద్దు చేయాలంటూ కోర్టులో ఇప్పటికే 20 పిటిషన్లు దాఖలు అయ్యాయని గుర్తు చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం మానవత్వంతో ఆలోచించాలని పేర్కొన్నారు. రిజర్వేషన్ల వ్యవస్థను సమూలంగా రద్దు చేయాలని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. రేవంత్ పాలన నిజాం రాజును తలపిస్తోందని కామెంట్ చేశారు. ఇప్పటికైనా గ్రూప్-1 పరీక్ష నిర్వహణలో ప్రభుత్వం మొండి పట్టు వీడాలని అన్నారు. అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జ్ సరికాదని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. కోర్టును కూడా ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. ఎవ్వరైనా హైకోర్టు తీర్పును గౌరవించాల్సిందేనని బండి సంజయ్ అన్నారు. గ్రూప్-1 అభ్యర్థుల సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డికి చెప్పేందుకే తాను అభ్యర్థులతో కలిసి సచివాలయానికి వెళ్తున్నానని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే బండి సంజయ్‌కి సీఎం రేవంత్‌రెడ్డి ఫోన్ చేశారు. జీవో నెం.29పై చర్చకు రావాలని ఆహ్వానించారు. 


Similar News