భక్తుల రక్తం కళ్ళచూసిన పాపం ఊరికే పోదు : Eatala Rajendar

సికింద్రాబాద్ కుమ్మరిగూడ ముత్యాలమ్మ దేవాలయం వద్ద హిందూ భక్తులపై పోలీసుల లాఠీఛార్జిని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రంగా ఖండించారు.

Update: 2024-10-19 11:05 GMT

దిశ, వెబ్ డెస్క్ : సికింద్రాబాద్ కుమ్మరిగూడ ముత్యాలమ్మ దేవాలయం వద్ద హిందూ భక్తులపై పోలీసుల లాఠీఛార్జిని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రంగా ఖండించారు.భక్తుల రక్తం కళ్ళచూసిన పాపం ఊరికే పోదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అమ్మవారిని కాళ్ళతో తన్ని అవమానించిన వ్యక్తి వెనుక ఉన్నది ఎవరో ఇప్పటివరకు ప్రకటించని ప్రభుత్వం..నిరసన తెలిపిన హిందువుల తలలు పగిలేలా దాడి చేయించడం దారుణమని తప్పుబట్టారు. పలు రాష్ట్రాల నుంచి రెండు వందల మంది సికింద్రాబాద్ మెట్రోపోలీస్ హోటల్ లో మత విద్వేషాలు రెచ్చగొట్టే సమావేశం పెట్టుకున్నారని తెలిసినా ఎందుకు ఉదారంగా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసు శాఖను ప్రశ్నించారు. లుంబినిపార్క్, గోకుల్ చాట్, దిలుషుక్ నగర్ బాంబు పేలుళ్లలో తెగిపడ్డ మాంసపు ముద్దలు గుర్తుకు వస్తున్నాయని, మీ చిల్లర రాజకీయాల కోసం తాత్సారం చేస్తే.. బలయ్యేది అమాయక ప్రజలు, మూల్యం చెల్లించాల్సింది మీ ప్రభుత్వమే అని ఈటల మరోసారి హెచ్చరించారు.

ఒక్క పిలుపు ఇస్తే ఇంతమంది భక్తులు వచ్చారంటేనే హిందువులు ఎంత రగిలిపోతున్నారో.. ఎంత అభద్రతతో ఉన్నారో.. ఈ ర్యాలీ ఒక ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. ఇకనైనా ప్రభుత్వం వెంటనే స్పందించి విద్వేషాలు రెచ్చగొట్టేందుకు వచ్చిన ముఠా వివరాలు బయటపెట్టి, కఠిన చర్యలు తీసుకోవాలని, అప్పుడే మా వాళ్ళ ఆగ్రహావేశాలు చల్లారుతాయని ఈటల స్పష్టం చేశారు. 

Tags:    

Similar News