హుక్కా సెంటర్లపై నిషేధం.. ఉభయ సభల్లో బిల్లు పెట్టిన ప్రభుత్వం

రాష్ట్రంలో ఇప్పటికే గుట్కా, గుడుంబా, మత్తు పదార్ధాల నిషేధం కొనసాగుతూ ఉండగా తాజాగా హుక్కా సెంటర్లపైనా బ్యాన్ విధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.

Update: 2024-02-12 15:53 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఇప్పటికే గుట్కా, గుడుంబా, మత్తు పదార్ధాల నిషేధం కొనసాగుతూ ఉండగా తాజాగా హుక్కా సెంటర్లపైనా బ్యాన్ విధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ముఖ్యమంత్రి తరఫున మంత్రి శ్రీధర్ బాబు ఉభయ సభల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. శాసనసభలో చర్చలేవీ జరగకుండా ఆమోదం లభించగా శాసనమండలిలో సభ్యులు విస్తారంగా చర్చించి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఉభయ సభల్లో ఈ బిల్లుకు ఏకగ్రీవ అమోదం లభించడంతో గవర్నర్ అనుమతి మేరకు త్వరలో గెజిట్ విడుదల కానున్నది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా హుక్కా సెంటర్లు క్లోజ్ కానున్నాయి.

మాదకద్రవ్యాల వినియోగంపై గతంలో ఎక్సయిజ్, పోలీసు అధికారులతో రివ్యూ సందర్భంగా హుక్కా సెంటర్లపైనా నిషేధం విధించాలన్న చర్చ జరిగింది. అనంతరం చట్టపరంగానే వీటిని బ్యాన్ చేసే దిశగా సలహాలు వచ్చాయి. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో సైతం రాష్ట్రంలోని అన్ని హుక్కా సెంటర్లను నిషేధించేలా నిర్ణయం జరిగింది. చివరకు అది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కార్యరూపం ధరించింది. గవర్నర్ ఆమోదంతో ఈ విధానం అమల్లోకి రానున్నది. హైదరాబాద్ సిటీలో ఎక్కువ సంఖ్యలో హుక్కా సెంటర్లు నడుస్తున్నాయి.

యువత భవిష్యత్తు కోసమే :

హుక్కా సెంటర్లను నిషేధించేలా ప్రభుత్వం రూపొందించిన బిల్లును శాసనసభ, శాసనమండలిలో ప్రవేశపెట్టే సందర్భంగా దీని వెనక ఉన్న ఉద్దేశాన్ని మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు. సిగరెట్‌ కంటే హుక్కా పొగ హానికరమైనదని, బొగ్గును వాడడం వల్ల కార్బన్‌ మోనాక్సైడ్‌ విడుదలై సేవించే వారితో పాటు చుట్టుపక్కల వారికీ ప్రమాదం చేస్తున్నదన్నారు. ఈ కారణంగానే హుక్కా పార్లర్లపై నిషేధం విధించాల్సి వస్తున్నదన్నారు. హుక్కా కేంద్రాల నిషేధ బిల్లు, సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల బిల్లు పేరుతో ప్రవేశపెట్టిన ఈ బిల్లు గురించి మండలిలో మంత్రి మాట్లాడుతూ, యువతను అవకాశంగా తీసుకుని హుక్కా నిర్వాహకులు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారని అన్నారు. ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వాణీదేవి మాట్లాడుతూ, హుక్కాకు యువత బానిసలవుతున్నారని, వారి ఆరోగ్యానికి, భవిష్యత్తుకు ప్రమాదకరంగా మారిందన్నారు. మాదకద్రవ్యాల విక్రయదారులపై కఠిన శిక్షలు ఉండాలని సూచించారు. హైదరాబాద్లో డ్రగ్స్ వినియోగం, సరఫరా పెరగడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ, హుక్కా సెంటర్లపై నిషేధంతో పాటు విజిలెన్స్ పరంగా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. పొరుగు రాష్ట్రాలతోనూ మాట్లాడి తగిన చర్యలు చేపట్టాలన్నారు. పొగాకు, గంజాయి సిగరెట్లు, చాక్లెట్ల రూపంలో విచ్చలవిడిగా వినియోగంలో ఉన్నట్లు ఇటీవల పలు ఘటనలు రుజవు చేస్తున్నాయని, ఈ కారణంగా హైస్కూల్ స్థాయి నుంచే యువత భవిష్యత్తు, ఆరోగ్యం ఇబ్బందుల్లో పడుతున్నదన్నారు.


ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, రాష్ట్రంలో గుట్కాపై గత ప్రభుత్వం నిషేధం విధించిందని, ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోనూ గంజాయి దొరుకుతూ ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రవేశపెట్టిన హుక్కా కేంద్రాల నిషేధం బిల్లు మంచిదన్నారు. హుక్కా పార్లర్లపై కఠినంగా వ్యవహరించాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సైతం మాదక ద్రవ్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలపై మరింత సీరియస్ దృష్టి పెట్టాలన్నారు.

Read More..

తెలంగాణలో మరోసారి భారీగా ఐపీఎస్‌ల బదిలీలు 

Tags:    

Similar News