బజరంగ్ దళ్ నిషేధం వివాదం.. బీజేపీ నాయకులు అరెస్ట్
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే భజరంగ్ ధళ్‌ను నిషేధిస్తామని హిందువుల మనోభావాలను దెబ్బతీశారని బిజెపి నాయకులు ఆరోపించారు.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే భజరంగ్ ధళ్‌ను నిషేధిస్తామని హిందువుల మనోభావాలను దెబ్బతీశారని బిజెపి నాయకులు ఆరోపించారు. కర్ణాటకలో బజరంగ్ నిషేధంపై ప్రకటనను వెనక్కి తీసుకోవాలని బీజేపీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యాలయం ముందు హనుమాన్ చాలీసా పారాయణానికి శుక్రవారం పిలుపునిచ్చారు. బీజేపీ జిల్లా కార్యాలయం నుంచి కాంగ్రెస్ భవన్‌కు బయలుదేరిన బీజేపీ నాయకులు అక్కడే అరెస్టు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు లక్ష్మీ నర్సయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్‌పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. ఉగ్ర చర్యలకు పాల్పడుతున్న పీఎఫ్‌ఐకి భజరంగ్ దళ్‌కి తేడా ఉందని ఆ విషయం కాంగ్రెస్ నాయకులకు కనపడక పోవడం దారుణం అన్నారు.
కర్ణాటకలో మతం ఆధారంగా ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. బజరంగ్ దళ్ హైందవ ధర్మం కోసం పాటుపడుతుందని దానిని గుర్తించాలని అన్నారు. కర్ణాటకలో బీజేపీకి వస్తున్న ఆదరణ చూడలేక కాంగ్రెస్ నాయకులు మైనార్టీ ఓట్ల కోసం నిషేధం అన్న పదాన్ని మేనిఫెస్టోలో పెట్టారని అన్నారు. ఈసారి కూడా కర్ణాటకలో కాషాయ పార్టీ గెలవడం ఖాయమన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఓబీసీ జిల్లా అధ్యక్షులు పోతాన్కర్ లక్ష్మీనారాయణ, నగర అధ్యక్షుడు పంచ రెడ్డి లింగం, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.