పాదపూజతో పరవశించిన మణిగిల్ల.. అట్టహసంగా అక్షర దీక్ష ముగింపు ప్రోగ్రాం
సాధారణంగా బోనాల పండుగ రోజు ఒక గ్రామంలో మహిళలందరు చక్కగా తయారై ఊరేగింపుగా ఆలయానికి వెళ్లడం మనం చూస్తాం.
దిశ, పెద్దమందడి: సాధారణంగా బోనాల పండుగ రోజు ఒక గ్రామంలో మహిళలందరు చక్కగా తయారై ఊరేగింపుగా ఆలయానికి వెళ్లడం మనం చూస్తాం. కానీ మణిగిల్ల గ్రామంలో అక్షర దీక్ష ముగింపు కార్యక్రమానికి 120 మంది విద్యార్థుల తల్లిదండ్రులు మంగళ వాయిద్యాలతో పాఠశాల ప్రాంగణానికి చేరుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మణిగిల్లలో అక్షర దీక్ష 41 రోజుల ముగింపు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులకు పాద పూజ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ రవీందర్ గారు హాజరయ్యారు.
ప్రత్యక్ష దైవ స్వరూపాలైన తల్లిదండ్రులకు పాదపూజ చేయడం విద్యార్థుల అదృష్టం అని తెలిపారు. అక్షరదీక్షలో వచ్చిన మార్పులను జీవితాంతం కొనసాగించాలని, ఈ దీక్షకు విరమణ ఉండకూడదని, ఉన్నత శిఖరాలను చేరుకుని విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. పదో తరగతి విద్యార్థులు అందరూ 10/10 జిపిఎస్ సాధించాలని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడుతూ పిల్లల బాగోగులకై వారి జీవితంలో స్థిరపడేదాకా వెన్నంటి ఉండాలని సూచించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శంకర్ గౌడ్ మాట్లాడుతూ తల్లిదండ్రులందరూ చక్కగా తయారై వాళ్ళ పిల్లల్ని వెంటబెట్టుకొని పాఠశాలకు చేరుకోవడం ఒక పండగ వాతావరణం సృష్టించిందని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులను మంగళ వాయిద్యాలు నడుమ పాఠశాలకు ఆహ్వానించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన మోటివేటర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలరని పలు ఉదాహరణలు ఇచ్చారు. అక్షర దీక్షలో తల్లిదండ్రులు తమ పిల్లలను హత్తుకొని ఆనంద భాష్పాలు రాలుస్తున్నప్పుడు, తాను కూడా ఉద్వేగానికి లోనయ్యానని, ఇలాంటి కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించడం తన అదృష్టం అన్నారు. ఒక తల్లిగా తాను కూడా భావోద్వేగానికి లోనయ్యానని స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు ఉమాదేవి అభిప్రాయపడ్డారు.
ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తూ పాఠశాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని మండల విద్యాశాఖ అధికారి జయశంకర్ తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాన్ని తమ పిల్లల కోసం రూపొందించినందుకు తాము అదృష్టవంతులమన్నారు. తమ పిల్లలు తప్పకుండా మంచి పౌరులుగా ఎదుగుతారని నమ్మకం ఇప్పుడు కలిగిందన్నారు. అక్షర దీక్ష కార్యక్రమానికి ధన్యవాదాలు తెలిపారు. మణిగిల్లలో పదవీ విరమణ చేసిన విశ్రాంత ఉపాధ్యాయులు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ అక్షర దీక్ష వల్ల విద్యార్థులలో స్టేజ్ ఫియర్ పోయిందన్నారు.
చదువులో బాగా రాణిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏదైనా సాధిస్తామనే నమ్మకం వస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా అక్షరదీక్ష కార్యక్రమాన్ని నిర్విగ్నంగా కొనసాగించినందుకు, తమ పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసినందుకు, తల్లిదండ్రులు విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయ బృందాన్ని ఘనంగా సత్కరించారు. అక్షర దీక్ష కార్యక్రమంలో ప్రతిరోజు పిడికెడు బియ్యాన్ని విద్యార్థులందరూ సేకరించారు. వాటన్నింటినీ 150 కిలోల వరకు సేకరించి రూరల్ డెవలప్మెంట్ సొసైటీకి అందజేశారు. వీటితో అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి శంకర్ గౌడ్, జిల్లా విద్యాధికారి శ్రీ రవీందర్, మండల విద్యాశాఖ అధికారి పి జయశంకర్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఉమాదేవి, పిరమిడ్ సొసైటీ నిర్వాహకులు సుఖేందర్ రెడ్డి, విశ్రాంత ఉపాధ్యాయులు సుధాకర్ రెడ్డి ,రూరల్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు శ్రీలక్ష్మి, జ్యోతి పాఠశాల ఉపాధ్యాయ బృందం శ్రీ వెంకటేశ్వర్లు గౌడ్, విష్ణువర్ధన్, నాగేశ్వరమ్మ, విజయ్ కుమార్, సురేఖ, చంద్రకళ ,శ్రీరామ్, దివ్య ఎస్ఎంసి చైర్మన్ పద్మజ తదితరులు పాల్గొన్నారు.