దారుణం.. మురికి కాలువలో ఇద్దరు నవజాత శిశువుల మృతదేహాలు లభ్యం

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట కాలనీలో ఓ అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది.

Update: 2023-04-06 03:55 GMT

దిశ, కామారెడ్డి రూరల్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట కాలనీలో ఓ అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. బతుకమ్మ కుంట కాలనీ మధ్యలో నుంచి ప్రవహించే మురికి కాలువలో అప్పుడే పుట్టిన నవజాత కవలలు ఆడ, మగ మృతదేహాలు కనిపించడం కలకలం రేపింది. స్థానికులు గుర్తించి కవలల మృదేహాలను బయటకు తీశారు. ఓ వస్త్రంలో ఇద్దరిని కట్టి కాల్వలో వదిలేసినట్లు గుర్తించారు. ప్రవాహంలో కొట్టుకొచ్చి చెత్త పేరుకుపోయిన చోట మృతదేహాలు ఆగిపోయాయి.

విషయం తెలుసుకున్న పట్టణ సీఐ నరేష్, ఎస్ఐ రాములు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. స్థానిక అంగన్వాడీ టీచర్లను పిలిపించి గర్భిణీల వివరాలను సేకరించారు. శిశువులు పుట్టుకతోనే మరణించారా లేదంటే పుట్టగానే ఎవరికీ తెలియకుండా కాలువలో విసిరేసారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారణం ఏదైనా కాలువలలో శిశువులను పడేయడం దారుణమైన చర్య అని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విగత జీవులుగా పడి ఉన్న పసి కందులను చూసి ప్రతి ఒక్కరూ కలత చెందారు. కవలల మృతదేహాలను కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Tags:    

Similar News