ఆర్టీఏ కార్యాలయాలపై ఏసీబీ పంజా.. 12 ఏళ్ల తర్వాత తనిఖీలు.. ఆ ఆర్టీవో వద్ద అక్రమ నగదు

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించడం కలకలం రేపుతోంది.

Update: 2024-05-28 10:16 GMT

దిశ, డైనవమిక్ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించడం కలకలం రేపుతోంది. మంగళవారం ఉదయం నుంచి హైదరాబాద్, రంగారెడ్డి, మహబ్ నగర్, మహబూబాబాద్, నల్గొండతో పాటు పలు జిల్లాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. 12 ఏళ్ల తర్వాత ఆర్టీఏ కార్యాలయాల్లో జరుగుతున్న ఈ ఆకస్మిక తనిఖీల్లో పలువురు అధికారులను అదుపులోకి తీసుకున్నారు. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు కౌంటర్లలోని ఉద్యోగుల వద్ద లెక్కలు చూపని నగదు లభ్యం అయినట్లు తెలుస్తోంది. ఇక ఏసీబీ సోదాల వల్ల దరఖాస్తుదారులను పోలీసులు నిలిపివేశారు.

పెద్ద ఎత్తున ఆరోపణలు

రవాణా శాఖలో జరుగుతున్న అవినీతిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఏజెంట్ల ద్వారా జరుగుతున్న దందాపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే టాక్ వినిపించింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఏక కాలంలో మెరుపుదాడులతో విరుచుకుపడిన ఏసీబీ అధికారులు ప్రతి కార్యాలయంలో మూడు అంతకంటే ఎక్కువ టీమ్ లుగా విడిపోయి తనిఖీలు చేపట్టారు. ఒక టీమ్ బయట ఉన్న ఏజెంట్లను ఆరా తీస్తుండగా మరో టీమ్ కార్యాలయాల్లో ఉన్న అధికారులను ఇక మూడో టీమ్ కేవలం ఆర్టీఏను మాత్రమే ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. మలక్ పేట, పాత బస్తీ బండ్లగూడ, టౌలి చౌకి, మహబూబ్ నగర్ లోని ఆర్టీఏ కార్యాలయంలో తనిఖీలు చేపట్టి ఐదుగురు ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట చెక్ పోస్టులోతనిఖీలు చేపట్టి సిబ్బంది వద్ద అక్రమంగా ఉన్న రూ.35 వేలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే చెక్ పోస్టులో అనధికారికంగా విధుల్లో ఏడుగురు వ్యక్తులు ఉన్నట్లు గుర్తించారు. మహబూబాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఆర్టీవో గౌస్ పాషా డ్రైవర్ సుబ్బారావును అదుపులోకి తీసుకున్నారు. రవాణా శాఖ అధికారి డ్రైవర్ వద్ద రూ.16,500, లైసెన్సులు, రెన్యువల్, ఫిట్ నెస్ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మండలం బోరజ్ చెక్ పోస్టుల దగ్గర ఎసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు కొనసాగుతోంది.

Tags:    

Similar News