Assembly: ఆ ఎమ్మెల్యేలపై వేటు వేయాల్సిందే.. తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్

తెలంగాణ బడ్జెట్ సమావేశాలలో కొందరు ఎమ్మెల్యేల తీరు జుగుత్సాకరంగా ఉందని, కనీస పరిజ్ఞానం లేకుండ ప్రవర్తించడం సిగ్గుచేటని తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్ డాక్టర్ బి కేశవులు పత్రికా ప్రకటనలో తెలిపారు.

Update: 2024-08-04 07:44 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ బడ్జెట్ సమావేశాలలో కొందరు ఎమ్మెల్యేల తీరు జుగుత్సాకరంగా ఉందని, కనీస పరిజ్ఞానం లేకుండ ప్రవర్తించడం సిగ్గుచేటని తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్ డాక్టర్ బి కేశవులు పత్రికా ప్రకటనలో తెలిపారు. ప్రజలు సమస్యలు, ఇబ్బందులు మరచి గతంలో తాము గొప్పలు చేశామని, తమ నేతలకు సాటి ఎవ్వరు లేరంటూ ప్రగల్భాలు పలుకుతూ అరుపులు కేకలు వేయడం, స్వంత డబ్బా కొట్టు కోవడానికే సభా సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. చివరకి స్పీకర్ కుర్చీని కూడ లెక్క చేయకుండా పోడియం వద్ద అవహేళనగా మాట్లాడుతున్నారని, ఇటువంటి వారి శాసన సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఆగ్రహించారు.

తప్పు చేసినవారు ఏ పార్టీకి చెందినవారైనప్పటికీ శిక్షలు అమలు చేయాల్సిందేనని, లేకపోతే ప్రజలకు శాసనసభ వ్యవస్థపై నమ్మకం కోల్పోతుందని డా బి కేశవులు తెలిపారు. అలాగే సమావేశాలలో కొందరి సభ్యుల తీరు చూస్తుంటే వాళ్లు రాజులు, మహారాజులు అనుకుంటున్నారని, ప్రజలు ఎన్నుకున్నది సేవలు చేయటానికి మాత్రమేనన్న విషయం మర్చిపోవద్దని సూచించారు. చివరకి కొందరు సీనియర్ శాసనసభ్యులు సైతం ఏకవచనాలతో మాట్లాడడం, జూనియర్లకు మార్గదర్శనం చేయకుండా ప్రవర్తించడం సరికాదన్నారు. వాళ్ల ప్రవర్తన అసెంబ్లీలో చూసాక అసలు అసెంబ్లీ లైవ్ ప్రోగ్రాం చూస్తే తమ పిల్లలు ఏం నేర్చుకుంటారోనన్న భయం తల్లిదండ్రుల్లో ఉందని డాక్టర్ కేశవులు ప్రకటనలో పేర్కొన్నారు.

Tags:    

Similar News