గ్రూపు-1 ప్రిలిమ్స్‌కు రంగం సిద్ధం.. ప్రతీ 20 సెంటర్లకు ఒక రీజినల్ కోఆర్డినేటర్

రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలు ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా జరగనున్నాయి. పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు కమిషన్ అన్ని ఏర్పాట్లనూ చేసింది.

Update: 2024-06-08 11:11 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలు ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా జరగనున్నాయి. పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు కమిషన్ అన్ని ఏర్పాట్లనూ చేసింది. మొత్తం 563 పోస్టుల భర్తీ కోసం జరుగుతున్న ఈ పరీక్షలకు దాదాపు 4.03 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రతీ అభ్యర్థికి యూనిక్ ఓఎంఆర్ షీట్‌ను ఇవ్వనున్నట్లు ఇప్పటికే కమిషన్ ప్రకటించింది. రాష్ట్రంలోని మొత్తం 31 జిల్లాల్లో 897 ఎగ్జామ్ సెంటర్లను నెలకొల్పిన కమిషన్... ప్రతీ కేంద్రంలో ఒక సిట్టింగ్ స్క్వాడ్ ఉంటుందని, ప్రతీ ఐదు సెంటర్లకు ఒక ఫ్లైయింగ్ స్క్వాడ్ ఉంటుందని తెలిపింది. ప్రతీ ఇరవై సెంటర్లకు ఒకరి చొప్పున రీజినల్ కోఆర్డినేటర్లను నియమించింది. ఇవి కాకుండా అభ్యర్థులు ఎగ్జామ్ సెంటర్‌లోకి వెళ్ళేటప్పుడు వారి హాల్ టికెట్, ఆధార్ కార్డులాంటి వివరాలతో పోల్చి చూసేందుకు వీలుగా ప్రతీ వంద మందికి ఒకరి చొప్పున ఎగ్జామినర్‌లను నియమించింది.

పరీక్షలు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగుతున్నందున సరిగ్గా పది గంటలకే సెంటర్ల మెయిన్ గేట్స్ క్లోజ్ అవుతాయని, ఆ తర్వాత ఎవ్వరినీ లోపలికి అనుమతించబోమని గతంలోనూ స్పష్టం చేసిన కమిషన్ తాజాగా మరోసారి వివరించింది. ఇప్పటికే సైట్ నుంచి హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నవారు ఇటీవల తీసుకున్న పాస్‌పోర్టు ఫోటోను అంటించాలని, ఎగ్జామ్ సెంటర్‌లోకి వెళ్ళిన తర్వాత ఇన్విజిలేటర్ సమక్షంలో దాని కింద సంతకం చేయాలని స్పష్టం చేసింది. పరీక్షల్లో కాపీయింగ్, మాల్ ప్రాక్టీసు లాంటివి చోటుచేసుకోకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశామని, పేపర్ లీకేజీ లాంటివి జరగకుండా సెంటర్ల దగ్గర 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు చుట్టూ పోలీసు భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ప్రతీ అభ్యర్థి బయోమెట్రిక్‌ను తీసుకోవడంతో పాటు అన్ని ఎగ్జామ్ సెంటర్లలో సీసీటీవీ నిఘాను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

పరీక్షలకు సంబంధించి ఏ సందేహాలున్నా నివృత్తి చేయడానికి అన్ని కలెక్టర్ కార్యాలయాల్లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. మరోవైపు ఆర్టీసీ కూడా అదనపు బస్సు సర్వీసులను నడుపుతున్నది. హైదరాబాద్ నుంచి జిల్లా కేంద్రాలకు రద్దీ ఎక్కువగా ఉన్నందున ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్ పాయింట్ల దగ్గర తగిన ఏర్పాట్లు చేసిందని, బస్సు స్టేషన్లలో హెల్ప్ సెంటర్లను నెలకొల్పినట్లు ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. పరీక్షా కేంద్రాల వివరాలను, దానికి తగినట్లుగా బస్సులు ఏ సమయంలో ఏ రూట్‌లో బయలుదేరుతాయో అభ్యర్థులకు వివరాలను ఈ సెంటర్లు అందజేస్తాయని తెలిపింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే దాదాపు 1.70 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నందున సిటీ బస్సులను కూడా సంఖ్యాపరంగా తగినన్ని రన్ చేస్తున్నట్లు తెలిపింది.

రాష్ట్రంలో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పరీక్షలు రాస్తున్నందున మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 105 సెంటర్లను, రంగారెడ్డి జిల్లాలో 93 సెంటర్లను, హైదరాబాద్‌లో 77 సెంటర్లను నెలకొల్పినట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. ఖమ్మం జిల్లాలో 52, నల్లగొండ జిల్లాలో 47 చొప్పున అన్ని జిల్లాలు కవర్ అయ్యేలా, విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ఎగ్జామ్ సెంటర్లను నెలకొల్పామని వివరించింది. అతి తక్కువగా భువనగిరి జిల్లాలో 9 సెంటర్లు, మెదక్‌లో 10, మహబూబాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 12 చొప్పున, నిర్మల్ జిల్లాలో 13 సెంటర్లను నెలకొల్పింది. పరీక్షా కేంద్రాల్లోకి వాచీలు, కాలిక్యులేటర్లు, పేజర్లు, సెల్‌ఫోన్‌లు, ట్యాబ్‌లు, పెన్ డ్రైవ్‌లు, బ్లూటూత్ పరికరాలు, లాగరిథమ్ బుక్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ను అనుమతించడంలేదని తెలిపింది. వీటిని తీసుకొచ్చినా ఎగ్జామ్ సెంటర్ బైటే ఉంచాలని, కానీ ఎలాంటి క్లాక్ రూమ్‌లు ఏర్పాటు చేయనందున అభ్యర్థులు గమనంలో ఉంచుకోవాలని తెలిపారు. 


Similar News