ట్యాంక్‌బండ్‌కు విగ్రహాలను తీసుకురావాల్సింది ఈ రూట్లోనే!

గ్రేటర్ హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించే వినాయక విగ్రహాల నిమజ్జనం విషయంలో కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది.

Update: 2022-09-08 06:42 GMT

దిశ ప్రతినిధి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించే వినాయక విగ్రహాల నిమజ్జనం విషయంలో కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది. భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి, వీహెచ్‌పీ, భజరంగ్ దళ్, బీజేపీ, ఇతర హిందూ సంఘాలు చేపట్టిన నిరసనలకు రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చింది. వినాయక ( హుసేన్) సాగర్‌లో వినాయక నిమజ్జనం చేసేందుకు ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ట్యాంక్ బండ్‌పై 8 క్రేన్లు, ట్యాంక్ బండ్ చుట్టూ 22 క్రేన్‌లను సిద్ధంగా ఉంచారు. ఇవికాక ఎన్టీఆర్ మార్గం మీద మరో 9 క్రేన్లు, పీపుల్స్ ప్లాజాలో 3 క్రేన్లు, బేబీ పాండ్ల వద్ద 2 క్రేన్లు ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్‌లో గణేశ్ నిమజ్జనానికి సంబంధించిన రూట్ మ్యాప్‌ను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విడుదల చేశారు. ఏయే రూట్ల నుంచి విగ్రహాలను ట్యాంక్ బండ్ వైపు తీసుకురావాలనే దానిపై ఈ రూట్ మ్యాప్ ద్వారా స్పష్టతను ఇవ్వడంతో నిమజ్జనం విషయంలో ఉన్న గందరగోళం వీడింది. ట్యాంక్‌బండ్‌పై వినాయక విగ్రహాల నిమజ్జనానికి గాను జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏల ఆధ్వర్యంలో ఏర్పాట్లు మొదలయ్యాయి.

దిగొచ్చిన సర్కార్

హుస్సేన్ సాగర్‌లో మట్టి గణపతి విగ్రహాలనే మాత్రమే నిమజ్జనం చేయాలంటూ ప్రభుత్వం సూచనను భాగ్యనగర్ గణేశ్ ఉత్సక కమిటీ వ్యతిరేకించింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను కూడా నిమజ్జనం చేసేందుకు అనుమతించాల్సిందేనని పట్టుబట్టి ధర్నాలకు దిగింది. దీంతో సర్కార్ దిగొచ్చింది. ఎప్పటి లాగానే గణేష్ నిమజ్జనానికి సంబంధించి హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై ఏర్పాట్లు చేశారు. బాలాపూర్ గణేశుడిని కూడా హైదరాబాద్ ట్యాంక్ బండ్‌లోనే నిమజ్జనం చేయనున్నారు. శానిటేషన్‌, హార్టీకల్చర్‌, ఎంటమాలజీ, విద్యుత్‌, ఆర్‌ ఆండ్ బీ, వాటర్‌ వర్క్స్‌, ఆరోగ్యశాఖతో పాటు ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు నిమజ్జనం ప్రశాంతంగా సాగేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆయా మార్గాల్లో శుక్రవారం రోజున ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుందని, దీన్ని అనుసరించి వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణం సాగించాలని పోలీసులు సూచించారు. నిమజ్జనం రోజున ప్రధాన ఊరేగింపు మార్గంలో విగ్రహాల శోభాయాత్రకు తప్ప, ఇతర ట్రాఫిక్‌కు అనుమతించకపోవడం గమనార్హం.

Tags:    

Similar News