ఆ కేసుల స్క్రిప్ట్ తయారయ్యేది గాంధీ భవన్ లోనే.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు
తెలంగాణ రాష్ట్రంలో రాక్షస -రాబందుల పాలన నడుస్తోందని, జైల్లో ఉండాల్సిన వ్యక్తి నేడు హోం మంత్రి, ముఖ్యమంత్రిగా ఉన్నాడని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో రాక్షస -రాబందుల పాలన నడుస్తోందని, జైల్లో ఉండాల్సిన వ్యక్తి నేడు హోం మంత్రి, ముఖ్యమంత్రిగా ఉన్నాడని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(BRS Leader RS Praveen Kumar) మండిపడ్డారు. తెలంగాణ భవన్ (Telangana Bhavan)లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పై ఫైర్ అయ్యారు. రాజ్యాంగ వ్యవస్థలన్నిటినీ రేవంత్ ద్వంసం చేస్తున్నారని, ప్రజల హక్కులను కాపాడాల్సిన సీఎం వాటిని హరిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్(BRS) ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల గొంతుకగా పోరాడటాన్ని రేవంత్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారని, సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిని రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు.
మార్చి 15, 16 తేదీల్లోనే పదిహేను కేసులు పెట్టారని, రీట్వీట్ (Retweet) చేసిన వారిపై కూడా కేసులు పెడుతున్నారని, అశ్లీలత మీద పెట్టాల్సిన సెక్షన్ 67 ఐటీ యాక్ట్ ని బీఆర్ఎస్ కార్యకర్తల(BRS Activists) మీద ప్రయోగించి ఎఫ్ఐఆర్‌లు(FIRs) నమోదు చేస్తున్నారని తెలిపారు. రేవంత్ హోమ్ మంత్రిగా ఆ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (CSB) ను దుర్వినియోగం చేస్తున్నారని, డిజిటల్ మోసాల నుంచి ప్రజలను రక్షించాల్సిన ఆ బ్యూరోను రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ సోషల్ మీడియా పై ప్రయోగిస్తున్నారని, సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు కొందరు రేవంత్ రెడ్డి తొత్తులుగా పని చేస్తూ కాపీ పేస్ట్ ఎఫ్ఐఆర్ లు నమోదు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సైబర్ పెట్రోలింగ్ పేరుతో తెలంగాణ భవన్ పైనే దృష్టి కేంద్రీకరించారని, గాంధీ భవన్, బీజేపీ కార్యాలయాలు సైబర్ పెట్రోలింగ్ లో ఎందుకు లేవు అని ప్రశ్నించారు. రేవంత్ సైన్యం పేరిట కేటీఆర్ పై దారుణమైన పోస్టులు పెడుతున్నారని, కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఎన్ని దారుణమైన పోస్టులు పెడుతున్నా సైబర్ పోలీసులు చర్యలు సుమోటోగా ఎందుకు తీసుకోవడం లేదని, మీరంటున్న ఫెయిర్ నెస్, పారదర్శకత ఎక్కడుంది అని నిలదీశారు. గౌతమ్, దిలీప్ కొణతం, క్రిశాంక్ సోషల్ మీడియా పోస్టుల్లో ఎలాంటి అసభ్యత ఉండదు.. అయినా 67 ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నారని తెలిపారు. ఒక వైపు రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకుని తిరుగుతున్నారని, మరో వైపు రేవంత్ రాజ్యాంగం ఉల్లంఘిస్తున్నా పట్టించుకోవడం లేదని అన్నారు.
కాంగ్రెస్, బీజేపీలు కలిసి రాష్ట్రంలో ప్రతి రోజూ వ్యవస్థీకృత నేరాలు చేస్తున్నాయని, ముందు వాటి మీద కేసులు పెట్టాలని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలు ఎన్ని పిర్యాదులు చేసినా పోలీసులు ఎఫ్ఐఆర్ లు నమోదు చేయడం లేదని, ఏ చట్ట ప్రకారం మా ఎఫ్ఐఆర్ లు నమోదు చేయడం లేదో చెప్పాలన్నారు. నకిరేకల్ ప్రశ్నా పత్రం లీకేజి కేసులో కేటీఆర్ పై మూడు తప్పుడు కేసులు పెడతారా? అంటూ ఒక్క కేసులో ఒకే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టు తీర్పులు ఉన్నాయి కదా అని ప్రశ్నించారు. నిజాయితీ పొలీసు అధికారులు రేవంత్ రెడ్డికి భయపడాల్సిన అవసరం లేదని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నిజాయతీ గల అధికారులను గుర్తించి ప్రోత్సహిస్తామని, వాళ్లకు ప్రమోషన్స్, మెడల్స్ ఇస్తామని చెప్పారు.
మాకు ఎలాంటి ఫేవర్ చేయనవసరం లేదని, నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తే చాలని అన్నారు. హరీష్ రావును పెట్రోల్ పోసి చంపుతామన్న కాంగ్రెస్ నేత మైనంపల్లిపై పోలీసులు ఎలాంటి కేసు పెట్టలేదని, గాంధీ భవన్ లో కేసుల స్క్రిప్ట్ తయారు చేస్తున్నారని, పొలీసు అధికారులు వాటిని యధాతథంగా ఎఫ్ఐఆర్ లుగా నమోదు చేస్తున్నారని తెలిపారు. గొర్రెల స్కాంలో కొడంగల్ కు చెందిన ఓ ఉన్నత అధికారిని 52 రోజులు ఆకారణంగా జైల్లో పెట్టారని, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇప్పటికైనా భాద్యతాయుతంగా పారదర్శకంగా పని చేయాలని, లేకపోతే అధికారులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అలాగే బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ పై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆర్ఎస్పీ డిమాండ్ చేశారు.