HYD: హుస్సేన్ సాగర్ చుట్టూ 34 క్రేన్లు.. అందుబాటులో గజ ఈతగాళ్లు!
నవరాత్రుల్లో భక్తుల నుంచి ఘనంగా పూజలందుకున్న గణనాధుడి నిమజ్జనానికి అధికార యంత్రాంగం సర్వం సిద్దం చేసింది. వివిధ ప్రభుత్వ శాఖలు నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు చేశారు.
దిశ, సిటీబ్యూరో: నవరాత్రుల్లో భక్తుల నుంచి ఘనంగా పూజలందుకున్న గణనాధుడి నిమజ్జనానికి అధికార యంత్రాంగం సర్వం సిద్దం చేసింది. వివిధ ప్రభుత్వ శాఖలు నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ (పీఓపీ) విగ్రహాలపై కోర్టు ఆంక్షలు విధించటంతో జీహెచ్ఎంసీ ఇప్పటి వరకు 30 సర్కిళ్ల పరిధిలో ఏర్పాటు చేసిన 74 కృత్రిమ కొలనులను పీఓపీ విగ్రహాలను నిమజ్జనం చేసేలా అప్‌డేట్ చేస్తుంది. ఇప్పటి వరకు అయిదడుగుల విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు వీలుగా ఏర్పాటు చేసిన కొలనుల్లో 12 అడుగుల ఎత్తున్న విగ్రహాలను కూడా నిమజ్జనం చేసేలా మార్చుతున్నారు. ముఖ్యంగా నిమజ్జనం కోసం హుస్సేన్ సాగర్ చుట్టూ 34 భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ పై 14 క్రేన్లను ఏర్పాటు చేయగా, ఎన్టీఆర్ మార్గ్‌లో 10, పీవీఆర్ మార్గ్‌లో మరో 10 క్రేన్లను ఏర్పాటు చేశారు.
నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 90 వేల విగ్రహాలు నిమజ్జనం కోసం హుస్సేన్ సాగర్‌కు వస్తున్నట్లు అధికారులు అంచనాలు వేస్తున్నారు. ముఖ్యంగా బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు జరిగే శోభయాత్ర 19 కి.మీ.ల పొడువున కొనసాగనున్నందున ఈ రూట్‌లో ఏర్పాట్లను బుధవారం పలువురు మంత్రులు, డీజీపీ, నగర పోలీసు కమిషనర్, జీహెచ్ఎంసీ కమిషనర్, మేయర్లు పరిశీలించారు. అంతేగాక, నిమజ్జనం కారణంగా హుస్సేన్ సాగర్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నారు. నిమజ్జనం జరిగే 33 చెరువులు, 74 కృత్రిమ కొలనుల వద్ద భారీ ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా చెరువుల వద్ద ముందు జాగ్రత్త చర్యగా 200 మంది గజ ఈతగాళ్లను కూడా అందుబాటులో ఉంచారు.
శానిటేషన్ పై స్పెషల్ నజర్..
19 కి.మీ.ల పొడువున సాగే బాలాపూర్ గణపయ్య శోభాయాత్రతో పాటు హుస్సేన్ సగర్ చుట్టూ శానిటేషన్ పై జీహెచ్ఎంసీ స్పెషల్ నజర్ పెట్టింది. ముఖ్యంగా శోభయాత్ర రూట్‌లో పోగయ్యే చెత్తను ఎప్పటికప్పుడు తొలగించి, వీధులను శుభ్రంగా ఉంచేందుకు వీలుగా దారి పొడువున సుమారు 10 వేల 500 మంది పారిశుధ్య కార్మికులను రౌండ్ ది క్లాక్ మూడు షిఫ్టుల్లో విధులు నిర్వర్తించేలా నియమించినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. వీరికి తోడు చెరువుల వద్ద విధులు నిర్వర్తించేందుకు మరో వెయ్యి మంది ఎంటమాలజీ విభాగానికి చెందిన సిబ్బందిని కూడా నియమించినట్లు అధికారులు వెల్లడించారు.
హుస్సేన్ సాగర్‌లోనే ఖైరతాబాద్ గణపయ్య నిమజ్జనం..
ఖైరతాబాద్ భారీ గణపయ్యను ఈసారి మట్టితో తయారు చేసినందున ఈ విగ్రహాన్ని ఎన్టీఆర్ మార్గ్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్రేన్ వద్ద నిమజ్జనం చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఉదయం ఏడు గంటలకే ఈ గణనాథుడిని నిమజ్జనం వైపు కదిలించాలని ఇప్పటికే పోలీసులు మండప నిర్వాహకులకు సూచించారు. ఈ గణనాధుడిని మండపం నుంచి కదిలించేందుకు వీలుగా విజయవాడ నుంచి ప్రత్యేకంగా క్రేన్ రప్పించినట్లు నిర్వాహకులు తెలిపారు. వినాయకుడిని ప్రతిష్టించిన నాటి నుంచే నిమజ్జనానికి వెళ్లే రూట్‌లో లైట్లను ఏర్పాటు చేయటం, చెట్ల కొమ్మలను తొలగించటం వంటి పనులను చేపట్టారు.