మహారాష్ట్రలో 'గులాబీ పార్టీ' గుడారం ఎత్తేయనుందా?

అసెంబ్లీ ఎన్నికలకు మహారాష్ట్ర సిద్ధమవుతోంది.

Update: 2024-10-04 02:07 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : అసెంబ్లీ ఎన్నికలకు మహారాష్ట్ర సిద్ధమవుతోంది. కానీ అక్కడ పోటీపై గులాబీ అధిష్టానం మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దీంతో పార్టీ కేడర్ డైలమాలో పడింది. దీనికి తోడు పార్టీ అధినేత కేసీఆర్ సైతం మహారాష్ట్ర నేతలతో భేటీకి దూరంగా ఉన్నారు. ఈ తరుణంలో నేతలంతా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించడంతో పాటు ప్రత్యేక ఫ్రంట్ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే కూటమి కార్యచరణ ప్రకటించబోతున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.

కేడర్ కు దూరంగా..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో మహారాష్ట్రలో పార్టీ కార్యక్రమాలు స్తంభించాయి. దీంతో మహారాష్ట్ర వైపు చూడటమే కేసీఆర్ బంద్ చేశారు. పర్యటనలు లేవు... భేటీలు లేకపోవడంతో కేడర్ అంతా నైరాశ్యంలో ఉంది. అసలు పార్టీ ఉందా? లేదా? అనే పరిస్థితి నెలకొంది. పార్లమెంట్ ఎన్నికల్లో మహారాష్ట్రలోని 48 స్థానాల్లో పోటీచేస్తామని గతంలో కేసీఆర్ ప్రకటించినా దూరంగా ఉన్నారు. దీంతో మహారాష్ట్ర కిసాన్‌ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మాణిక్‌రావు కదం బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి ఎన్సీపీలో చేరారు.

థర్డ్ ఫ్రంట్ దిశగా గులాబీ నేతలు..

మహారాష్ట్రలో బీజేపీ, ఎన్సీపీ-శివసేన కూటములకు ప్రత్యామ్నాయంగా ఆ రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతీయపార్టీలు ‘పరివర్తన్ మహాశక్తి’ పేరుతో మూడో కూటమి ఏర్పాటుకు సన్నద్ధమవుతున్నాయి. పోటీపై, పొత్తులపై కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, రాష్ట్రంలోని పార్టీ నేతల ఏకాభిప్రాయంతోనే ఫ్రంట్ ప్రయత్నాలు చేస్తున్నామని బీఆర్ఎస్ నేత శంకరన్న దోండ్గే తెలిపారు. సోలాపూర్, ఔరంగాబాద్, లాథూర్, హుమ్నాబాద్, బీవండి, నాందేడ్, గాడ్చిరోలి, నాగ్ పూర్, థానే, నాసిక్, కల్యాణ్, బీడ్, పర్బాణి, సాంగ్లీ, నాసిక్ ఇలా 15కు పైగా నియోజకవర్గాల్లో తెలుగువారు ఎక్కువగా ఉండటంతో కలిసివచ్చే అంశం. కూటమి నేతలు ఈ నెల 7న మరోసారి భేటీ అవుతున్నట్లు సమాచారం. అందులో విధివిధానాలు వెల్లడిస్తారని విశ్వసనీయంగా తెలిసింది.

ఎన్సీపీలో విలీనం అంటూ ప్రచారం.. 

తెలంగాణలో ఓటమితో మహారాష్ట్రలో పార్టీ విస్తరణపై కేసీఆర్ దృష్టిసారించకపోవడంతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్‌పీ)లో బీఆర్ఎస్ మహారాష్ట్ర యూనిట్ విలీనం అవుతుందనే ప్రచారం ఊపందుకుంది. మంగళవారం పుణెలో బీఆర్‌ఎస్ మహారాష్ట్ర నేత బాలాసాహెబ్ దేశ్‌ముఖ్, శరద్ పవార్ భేటీ అయ్యారని, విలీనం చేస్తున్నట్లు ప్రకటించినట్లు ప్రచారం జరిగింది. ఈ నెల 6న అధికారికంగా విలీనం జరుగుతుందని సమాచారం. అయితే ఈ ప్రచారాన్ని పార్టీ రాష్ట్ర సమన్వయకర్త శంకరన్న దోండ్గే ఖండించారు. బీఆర్ఎస్ (మహారాష్ట్ర) ఏ పార్టీలో విలీనం కాదని, మూడో ఫ్రంట్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నామని వెల్లడించారు. ఏదిఏమైనా దీనిపై కేసీఆర్ స్పందిస్తే ఈ విలీన ప్రచారానికి ఫుల్ స్టాప్ పడుతుంది. అయితే అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం రాజకీయ వర్గాల్లో హాట్ టాఫిక్ గా మారింది.


Similar News