సమీపిస్తున్న గడువు.. లక్ష్యానికి దూరంగా ప్రాపర్టీ టాక్స్ కలెక్షన్!
ప్రాపర్టీ ట్యాక్స్‌కు సంబంధించి ఐదు శాతం రాయితీతో చెల్లించే గడువు మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది.
దిశ, సిటీబ్యూరో: ప్రాపర్టీ ట్యాక్స్‌కు సంబంధించి ఐదు శాతం రాయితీతో చెల్లించే గడువు మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నెల 2 నుంచి ఐదు శాతం రాయితీనిస్తూ అమలు చేస్తున్న ఎర్లీ బర్డ్ స్కీం కింద రూ.750 కోట్లను వసూలు చేసుకోవాలన్న లక్ష్యంతో ఉన్న జీహెచ్ఎంసీ ఇప్పటి వరకు సుమారు రూ.560 కోట్లను వసూలు చేసుకున్నట్లు తెలిసింది.
మిగిలి ఉన్న మరో మూడు రోజుల్లో లక్ష్యాన్ని అధిగమించేందుకు దాదాపు రూ.190 కోట్లను వసూలు చేయాల్సి ఉంది. గత ఆర్థిక సంవత్సరం (2022-23) ఎర్లీ బర్డ్ స్కీం కింద సుమారు రూ.743 కోట్లను వసూలు చేసుకున్న జీహెచ్ఎంసీ వర్తమాన ఆర్థిక సంవత్సరానికి కేవలం రూ.7 కోట్లను పెంచి రూ.750 కోట్లను టార్గెట్‌గా నిర్ణయించింది. రానున్న మూడు రోజుల్లో జీహెచ్ఎంసీ రూ.750 కోట్ల టార్గెట్‌ను రీచ్ అవుతుందా? లేదా? వేచి చూడాలి.
మే నుంచి నెలవారీ టార్గెట్లు..
ఈ నెలాఖరుతో ఎర్లీ బర్డ్ స్కీం అమలుకు తెరపడటంతో మే నుంచి జీహెచ్ఎంసీ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లకు నెలసరి కలెక్షన్ టార్గెట్లు ఇవ్వనున్నట్లు సమాచారం. మున్ముందు ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రమయ్యే అవకాశమున్నందున ఇచ్చిన టార్గెట్ల ప్రకారం ట్యాక్స్ వసూలు కావల్సిందేనన్న ఆలోచనలో అధికారులున్నట్లు తెలిసింది.