భూ భారతికి ప్రజామోదం.. సంక్రాంతిలోపు తహశీల్దార్ల బదిలీలు

ప్రభుత్వం రైతులకు మేలు చేసేందుకు ఆమోదించిన నూతన భూ భారతి -2025 చట్టాన్ని ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారని, ప్రజామోదం పొందిందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి అన్నారు.

Update: 2025-01-07 12:13 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం రైతులకు మేలు చేసేందుకు ఆమోదించిన నూతన భూ భారతి -2025 చట్టాన్ని ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారని, ప్రజామోదం పొందిందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి అన్నారు. కానీ ప్రతిపక్షాలు విమర్శించడం విచారకరమన్నారు. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా)ఆధ్వర్యంలో రూపొందించిన రెవెన్యూ డైరీ -2025 ను ట్రెసా అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఆవిష్కరణ సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని, సంక్రాంతి లోపు తహశీల్దార్ల ఎన్నికల తిరుగు బదిలీలు ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. సంబంధిత దస్త్రాన్ని పంపించవల్సిందిగా రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శికి అదేశాలు జారీ చేశామన్నారు. ముఖ్యమంత్రి ఆమోదించినప్పటికి సమయాభావం వల్ల గత కేబినెట్ లో నూతన గ్రామ రెవెన్యూ వ్యవస్థకు, 33 మంది సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులకు అమోదం పొందలేకపోయామన్నారు. వచ్చే కేబినెట్ తప్పనిసరిగా ఆమోదింపచేస్తామని ఉద్యోగుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఉద్యోగులంతా నిజాయితీగా పనిచేసి ఈ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. రెవెన్యూ శాఖను పటిష్టపరిచి రైతులకు న్యాయం చేస్తామని స్పష్టం చేశారు.

అధికార వికేంద్రీకరణ

రైతుల భూ సమస్యలు పరిష్కరించేందుకు, సమగ్ర భూ రికార్డులను నిర్వహించుటకు భూ భారతి -2024 ఆర్వోఆర్ చట్టాన్ని చేసి, అప్పీలు చేసుకునేందుకు వీలుగా యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారని ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి అన్నారు. అధికార వికేంద్రీకరణ చేసి పాలనను ప్రజలకు చేరువ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 317 జీవో వల్ల ఇబ్బంది పడుతున్న ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని, సాధారణ బదిలీలలో డిప్యూటీ తహశీల్దార్లను, సీనియర్ అసిస్టెంట్లను సుదూర ప్రాంతాలకు బదిలీ చేసారని వారిని సొంత జిల్లాలకు కేటాయించాలని కోరారు. జీఓ నెం.81 ప్రకారం 61 సంవత్సరాలు వయస్సు పైబడిన వీఆర్ఏల వారసులకు ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వాలరి, వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి దృష్టికి తెచ్చారు. పెండింగ్ లో ఉన్న రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ట్రెసా ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్ కుమార్ మాట్లాడుతూ.. నూతనంగా ప్రజాప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లో 22 వేల వీఆర్ఏలుగా ఉండి జూనియర్ అసిస్టెంట్లు/రికార్డ్ అసిస్టెంట్లుగా కేటాయించిన తర్వాత వెంటనే వేతనాలు మంజూరు చేశారని కొనియాడారు.

రెవెన్యూ శాఖ ద్వారా ప్రజలకు సమర్థవంతంగా సేవలు అందించుటకు గ్రామ రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటు నిర్ణయించిన సందర్బంగా సీఎం, మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. వివిధ పేర్లతో పిలవబడుతున్న(613)మంది కంప్యూటర్ ఆపరేటర్లు (Out Sourcing), మీ సేవ ఆపరేటర్లను అలాగే హ్యాండ్ హోల్డింగ్ పర్సన్స్ లను ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి హెచ్ ఆర్ పాలసీని అమలు చేయాలన్నారు. ధరణి ఆపరేటర్లకు ఏజెన్సీ ద్వారా కాకుండా ప్రభుత్వమే వేతనాలు చెల్లించాలని, ప్రభుత్వం చేపట్టిన ప్రజల సంక్షేమ కార్యక్రమాలకు ట్రెసా పూర్తి మద్దతు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్ కుమార్, డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు చంద్రమోహన్ , ఏనుగు నరసింహా రెడ్డి, విజయేందర్ రెడ్డి, ట్రెసా అసోసియేట్ అధ్యక్షులు పడిగెల రాజ్‌కుమార్, ఎండీ రియాజుద్దీన్, కోశాధికారి బి. వెంకటేశ్వర్ రావు, ఉపాధ్యక్షులు నాగమణి, కో ఆర్డినేటర్ నారాయణరెడ్డి, కార్యదర్శులు మనోహర్ చక్రవర్తి, టి.వాణి రెడ్డి, సంయుక్త కార్యదర్శులు జగన్మోహన్ రెడ్డి, శ్రవణ్, వాణి, మునీర్ పాల్గొన్నారు.


Similar News