Thurkayamjal : తుర్కయాంజల్ చెరువును పరిశీలించిన హైడ్రా కమిషనర్
ఆక్రమణలకు సంబంధించి స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు తుర్కయాంజల్(Thurkayamjal) చెరువును హైడ్రా కమిషనర్(Hydra Commissioner)రంగనాథ్ (Ranganath)బుధవారం సందర్శించారు(Visited).
దిశ, వెబ్ డెస్క్ : ఆక్రమణలకు సంబంధించి స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు తుర్కయాంజల్(Thurkayamjal) చెరువును హైడ్రా కమిషనర్(Hydra Commissioner)రంగనాథ్ (Ranganath)బుధవారం సందర్శించారు(Visited). చెరువు తూములు మూసేసి అలుగు పెంచడంతో చెరువు పైభాగంలో పంటపొలాలు, ఇండ్లు నీట మునుగుతున్నాయని స్థానికులు ఈ నెల 6వ తేదీన హైడ్రా నిర్వహించిన ఎఫ్ టీఎల్(FTL) ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులపై నేరుగా క్షేత్ర స్థాయిలో పరిస్థితిని పరిశీలించేందుకు కమిషనర్ స్వయంగా చెరువును సందర్శించారు.
ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ ఫిర్యాదులపై క్షేత్ర స్థాయి పరిశీలన చేశామని, ఇరిగేషన్ ఇంజనీర్లు, రెవెన్యూ అధికారులతో చర్చిస్తామని, అలాగే ఐఐటి, బిట్స్ పిలాని, జెఎన్టీయూ విద్యాలయాల ఇంజనీరింగ్ నిపుణులతో కూడా అధ్యయనం చేయిస్తామన్నారు. ఎన్నార్ఎస్సీ ఇమేజీలు, గ్రామాలకు చెందిన మ్యాప్స్ తో పరిశీలించి రెండు మూడు నెలల్లో శాస్త్రీయ పద్ధతుల్లో చెరువు ఎఫ్ టీఎల్ నిర్ధారిస్తామని, ఆక్రమణలపై నిష్పక్షపాతంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
నగరంలో కొన్ని చెరువులు మాయమైతే మరికొన్ని చెరువులు ఎఫ్ టీఎల్ పరిధి పెరుగుతున్నట్టు ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలిస్తామన్నారు. తుర్కయాంజల్ చెరువులోకి మురుగు నీరు వచ్చి చేరుతోందని, ఆ నీరు కిందకు పోవడం లేదని స్థానికుల ఫిర్యాదు చేశారని తెలిపారు. తాము ఇంటి స్థలాలు కొన్నప్పుడు ఈ స్థలంలో నీరు నిలవ లేదని చెరువుపై భాగంలో ఆదిత్య నగర్ నివాసితుల ఫిర్యాదు చేశారన్నారు. చెరువుకు సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకొని శాస్త్రీయ పద్దతిలో ఎఫ్ టీఎల్ నిర్ణయిస్తామని రంగనాథ్ హామీ ఇచ్చారు.
నిర్వాసితులు ఆందోళన చెందాల్సిన పని లేదని భరోసా ఇచ్చారు. పేదలను హైడ్రా ఇబ్బంది పెట్టదని, హైడ్రా పేరు చెప్పి మిమ్ములను భయపెట్టేందుకు ప్రయత్నిస్తే నమ్మవద్దన్నారు. తుర్కయాంజల్ చెరువు విస్తరణ 495 ఎకరాల్లో ఉందని..మొత్తం విస్తీర్ణం 522 ఏకరాలని..అన్ని లెక్కలను పరిగణనలోకి తీసుకుని విచారణ చేస్తామన్నారు. కాగా తుర్కయాంజల్ చెరువు పరిశీలనకు వచ్చిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు స్థానిక ప్రజలు పూల మొక్కలు అందించి ఘన స్వాగతం పలకడం విశేషం.