ఏపీ ఎస్ అంటే తెలంగాణ నో.. సుప్రీంకోర్టులో విచారణ వాయిదా
సుప్రింకోర్టులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది.
దిశ, డైనమిక్ బ్యూరో:కృష్ణా నదీ పరీవాహ ప్రాంతంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విద్యుత్ కేంద్రాలను కేఆర్‌ఎంబి పరిధిలోకి తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. తుది వాదనలు ఏప్రిల్ 30న వింటామని జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌ల ధర్మాసనం వెల్లడించింది. సంబంధిత అథారిటీ అనుమతి లేకుండా తెలంగాణ ప్రభుత్వం తమ పరిధిలో ఉన్న విద్యుత్ కేంద్రాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని, దీని వల్ల ప్రాజక్టుల్లో నీటి వాటా వినియోగంలో తేడాలు వస్తున్నాయని 2021లో ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేయడంతో పాటు అదే ఏడాది జులైలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వ పిటిషన్ పై కేంద్రానికి, కేఆర్ఎంబీ, తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ జెన్ కో సీఎండీలకు సుప్రీంకోర్టు గతంలో నోటీసులు సైతం జారీ చేసింది. ఈ క్రమంలో ఈరోజు మరోసారి జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌ల ధర్మాసనం ముందు ఈ పిటిషన్ విచారణకు రాగా ఈ వ్యవహారంపై సుదీర్ఘ వాదనలు వినిపించాల్సి ఉందని, అందువల్ల వాయిదా వేసి మరో తేదీ ఇవ్వాలని తెలంగాణ తరపు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ కోరారు. అయితే తెలంగాణ న్యాయవాది అభ్యర్థరన పట్ల ఏపీ తరపు న్యాయవాది రఘుపతి అభ్యంతరం తెలిపారు. తాము ఇప్పుడు వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం ఏప్రిల్ 30న తుది వాదనలు వింటామని వాయిదా వేసింది.