నకిలీ పాస్ పోర్టుల కేసులో మరో ట్విస్ట్.. ఏస్బీ ASI అరెస్ట్

భీంగల్‌లో నకిలీ పాస్ పోర్టులు, పత్రాల కేసులో సీబీ సీఐడీ సోదాలు సంచలనం రేపిన విషయం తెలిసిందే.

Update: 2024-01-30 06:45 GMT

దిశ, భీంగల్ : భీంగల్‌లో నకిలీ పాస్ పోర్టులు, పత్రాల కేసులో సీబీ సీఐడీ సోదాలు సంచలనం రేపిన విషయం తెలిసిందే. కాగా, భీంగల్ మండల కేంద్రంలో సీబీసీఐడీ టీం సుమారు గంటన్నర పాటు ముచ్కూర్ రోడ్డులో గల నకిలీ పాస్ పోర్టుల కేసు నిందితుడు సుభాష్ ఇంట్లో సోదాలు నిర్వహించి అతని వద్ద నుండి ల్యాప్ టాప్, ఇతర విలువైన సమాచారం గల పత్రాలు, నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకొన్నారు. దాంతో పాటుగా నిందితుడిని అదుపులోకి తీసుకొని వెళ్లిన సీఐడీ బృందం ఇంట్రాగేట్ చేసింది.

సుభాష్‌ను విచారించిన సీబిసీఐడీ బృందానికి కళ్ళు చేదిరే విషయాలు వెల్లడి అయినట్లు తెలిసింది. అందులో భాగంగానే మాక్లూర్, నవీపేట ఎస్బీ ఇన్‌ఛార్జ్ లక్ష్మణ్‌ను మంగళవారం తెల్లవారుజామున సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. సీఐడీ అధికారులు జిల్లా కేంద్రంలోని గంగస్థాన్‌లో గల లక్ష్మణ్ నివాసం నుండి విచారణ నిమిత్తం తీసుకెళ్లారు. దీంతో భీంగల్ కేంద్రంగా లైసెన్స్‌లు లేని ట్రావెల్స్ నిర్వాహకుల్లో భయాందోళన మొదలైంది. గతంలో పొట్టకూటి కోసం గల్ఫ్ వెళ్లే కార్మికులే టార్గెట్‌గా నకీలీ పత్రాలను సృష్టించి నకిలీ పాస్ పోర్టులు ఇప్పించిన సంఘటనలు అనేకం ఉన్నాయి.

కాగా నకిలీ పాస్ పోర్టుల వ్యవహారం ఎక్కడ బైట పెడతాడోనాన్న భయందోళనలు ప్రారంభమయ్యాయి. భీంగల్‌లో సీఐడి సోదాలు జరిగిన రెండు, మూడు రోజులు ట్రావెల్స్ దుకాణలను మూసి ఉంచిన ట్రావెల్స్ యజమానులు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ఎస్బి ఏఎస్సై లక్ష్మణ్ అరెస్ట్‌తో నకీలి పాస్ పోర్ట్ వ్యవహారంలో తల దూర్చిన మరింత మంది ఎస్బి అధికారుల, నకీలి పత్రాలు, పాస్ పోర్టుల ఎజెంట్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ నకీలి పత్రాలు, గతంలో బోధన్ కేంద్రంగా రోహింగ్యాల పాస్ పోర్టుల వ్యవహారంతో పాటు ఇతర నకిలీ పత్రాలు, పాస్ పోర్టుల జారీ వ్యవహారంలో పాలు పంచుకున్న అధికారులు, ఎజెంట్లు అందరి బాగోతం బయట పడ్డట్లు తెలుస్తోంది. ఒక్కక్కరిగా అందరినీ వరుసగా అదుపులోకి తీసుకొని విచారించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.


Similar News