మెడికల్ డిపార్ట్ మెంట్‌లో సూపర్ బాస్.. గోప్యంగా జీవో
దిశ, తెలంగాణ బ్యూరో: మెడికల్ డిపార్ట్ మెంట్ లో ఆయన సూపర్ బాస్‌గా వ్యవహరిస్తున్నారా.. !
దిశ, తెలంగాణ బ్యూరో: మెడికల్ డిపార్ట్ మెంట్ లో ఆయన సూపర్ బాస్‌గా వ్యవహరిస్తున్నారా.. ! సీఎంఓలో చక్రం తిప్పుతూ కీలక బాధ్యతలన్నీ తనకే వచ్చేలా చేసుకుంటున్నారా! ప్రాధాన్యతున్న పోస్టులను తన గుప్పిట్లోనే పెట్టుకంటున్నారా! పరిణామాలు చూస్తే అలాగే కనిపిస్తోంది. ఇప్పటికే మూడు కీలక పోస్టుల్లో ఉన్న అతనికి మరో పోస్టును ప్రభుత్వం కేటాయించినట్లు తెలిసింది. గోప్యంగా జీఓ జారీ చేయడంతో డీఎంఈ రమేశ్ రెడ్డి పై సర్కారు అత్యంత ప్రేమ చూపుతున్నదని వైద్యారోగ్యశాఖ కార్యాలయాల్లో జోరుగా చర్చ నడుస్తున్నది.
కొత్త దవాఖానాలు, మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణాలు, నిర్వహణ కోసం ఇటీవల ప్రభుత్వం కొత్త కార్పొరేషన్ ను ఏర్పాటు చేసింది. దానికి ఎండీగా డా రమేశ్ రెడ్డి ని నియమించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే దానికి సంబంధించిన జీవోను మాత్రం బయటకు రాకుండా గోప్యంగా ఉంచినట్లు సమాచారం. వైద్యారోగ్యశాఖలో అర్హులునప్పటికీ కీలక బాధ్యతలన్నీ ఆయనకే ఇవ్వడంపై మిగతా డాక్టర్లలో అసంతృప్తి నెలకొంది. ఏళ్ల తరబడి హెచ్ఓడీల పోస్టుల కోసం చూస్తున్నోళ్లకు సర్కార్ అవకాశం ఇవ్వడం లేదు. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించే ఆఫీసర్లు ఎందరో ఉన్నా, కేవలం రమేశ్ రెడ్డికే అన్ని పోస్టులు అప్పగిస్తుండడంపై మెడికల్ యూనియన్లు సైతం మండిపడుతున్నాయి. ప్రభుత్వానికి రమేష్ రెడ్డి తప్ప మరెవ్వరూ కనిపించడం లేదా? అంటూ ప్రశ్నిస్తున్నాయి.
ఆయన అండతోనే..!
సీఎం ఆఫీసులో తన సామాజిక వర్గానికి చెందిన ఓ సీనియర్ ఆఫీసర్ అండదండలతోనే డిపార్ట్ మెంట్ లో రమేశ్ రెడ్డి చెప్పిందే వేదంగా మారిపోయిందని పలువురు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. తాను చెప్పిందే ప్రభుత్వం అమలు చేస్తుందనే తరహాలో డిపార్ట్ మెంట్ లో వ్యవహరిస్తూ ఉంటారని డీఎంఈ కార్యాలయంలో ఉద్యోగులు గుసగుసలాడుతున్నారు. ప్రస్తుతం రమేశ్ రెడ్డి డీఎంఈ, గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, టీవీవీపీ కమిషనర్ గా మూడు పోస్టుల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీనికి అదనంగా మళ్లీ కొత్తగా కార్పొరేషన్ ఎండీ బాధ్యతలు ఇచ్చినట్లు తెలిసింది. ఒక్కరికే ఇన్ని పోస్టులు ఇవ్వడం పట్ల వైద్యవర్గాల్లో అసంతృప్తి నెలకొన్నది. పైగా పనుల్లోనూ జాప్యం జరుగుతున్నదని స్వయంగా ఆయా విభాగాల్లో పనిచేసే ఉద్యోగులే చెబుతుండడం గమనార్హం. టీవీవీపీ అయితే అస్తవ్యస్తంగా మారిపోయిందని ప్రభుత్వమే అసంతృప్తిని ఉన్నదంటే పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు.
ఆయనకు అనుకూలంగానే..
డా రమేశ్ రెడ్డి మొదట్నుంచి ఆయనకు లాభం జరిగేలా నిర్ణయాలు తీసుకుంటూ ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తున్నారనే వాదనలు ఉన్నాయి. ఆయన వర్గానికి చెందిన మనిషే సీఎంవో లో ఉండటంతో సర్కార్ కూడా రమేశ్ రెడ్డి నిర్ణయాలను ఎన్నడూ వ్యతిరేకించ లేదు. ప్రొఫెసర్ల రిటైర్మెంట్ ఏజ్‌ను 65 ఏండ్లకు పెంచాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉన్నప్పటికీ, తనకంటే సీనియర్లు అంతా రిటైర్ అయ్యేవరకు ఆ ఫైల్‌ను రమేశ్ రెడ్డి తొక్కి పెట్టినట్లు మెడికల్ యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు. 2019 జూన్‌లో రమేశ్ రెడ్డి రిటైర్ కావాల్సిన సమయంలోనే ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయసును పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన ఇప్పటికీ డీఎంఈగానే కొనసాగుతున్నారు. మరోవైపు ఇటీవల ప్రమోషన్లు పొందిన 31 మందిలో ఆయన 13వ స్థానంలో ఉన్నా డీఎంఈ కుర్చీని వదలకపోవడం గమనార్హం.