హైడ్రాకు మరిన్ని పవర్స్.. రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

ప్రభుత్వ భూములు, జల వనరుల సంరక్షణకు కొత్త విధానం తీసుకురావాలని సర్కారు భావిస్తున్నది. ఇందుకోసం కొత్త నిర్మాణాలన్నింటికీ హైడ్రా(Hydra) క్లియరెన్స్ కంపల్సరీ అనే నిబంధన తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నట్లు చర్చ జరుగుతున్నది.

Update: 2024-09-24 01:56 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ భూములు, జల వనరుల సంరక్షణకు కొత్త విధానం తీసుకురావాలని సర్కారు భావిస్తున్నది. ఇందుకోసం కొత్త నిర్మాణాలన్నింటికీ హైడ్రా(Hydra) క్లియరెన్స్ కంపల్సరీ అనే నిబంధన తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నట్లు చర్చ జరుగుతున్నది. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో హైడ్రాకు విస్తృతాధికారాలు కల్పిస్తూ జరిగిన నిర్ణయానికి కొనసాగింపుగా.. చట్ట సవరణ కోసం లా డిపార్టుమెంటులో కసరత్తు జరుగుతున్నది. వివిధ మున్సిపల్, పంచాయతీ శాఖలు భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే ముందే హైడ్రా తన నిర్ణయాన్ని ఆ శాఖలకు అందించనున్నది. అది ఇచ్చే రిపోర్టు ఆధారంగా నిర్మాణాలకు ఈ శాఖలు పర్మిషన్ ఇవ్వనున్నాయి. ఆ దిశగా లీగల్‌పరంగా ముసాయిదా నిబంధనలు రూపొందుతున్నాయి. పూర్తిస్థాయిలో ఎక్సర్‌సైజ్ జరిగిన తర్వాత మరింత క్లారిటీ రానున్నది. ఆర్డినెన్సుగా వస్తుందా? లేక అసెంబ్లీ సెషన్ పెట్టి బిల్లు రూపంలో ప్రభుత్వం తీసుకొస్తుందా? అనేది కూడా రానున్న రోజుల్లో స్పష్టం కానున్నది.

ముందుగానే నివారణ చర్యలు

చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లతోపాటు పార్కులు, ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి అక్రమంగా కట్టిన కట్టడాలను కూల్చివేస్తున్న హైడ్రా... ఇకపైన వెలిసే కట్టడాల విషయంలో ముందుగానే నివారణ చర్యలు తీసుకునేలా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. హైడ్రాకు విస్తృతాధికారాలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించిన నేపథ్యంలో, ఔటర్ రింగు రోడ్డు వరకు దీని పరిధిని ఫిక్స్ చేసిన పరిస్థితుల్లో ప్రస్తుతం జీహెచ్ఎంసీ చట్టానికే సవరణలు చేసి అదనపు అధికారాలను కల్పించాలనుకుంటున్నది. ఈ దిశగానే చట్ట సవరణ కోసం లా డిపార్టుమెంటులో అధికారులు నిర్దిష్టమైన క్లాజులను చేరుస్తున్నారు. అందులో భాగమే ఇక నుంచి కొత్తగా నిర్మాణాల కోసం జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేసుకుంటే అది హైడ్రాకు వెళ్లేలా చట్టంలో నిబంధనలు పొందుపరుస్తున్నట్లు తెలిసింది. ఆ స్థలం చెరువులు, కుంటల ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లో ఉన్నదో లేదో హైడ్రా నిర్ధారిస్తుంది. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిందో లేదో కూడా తేల్చేస్తుంది. అన్నీ సక్రమంగా ఉన్నట్లయితేనే క్లియరెన్సు ఇచ్చేలా లీగల్ కసరత్తు జరుగుతున్నది. దానికి అనుగుణంగానే పర్మిషన్లు జారీ కానున్నాయి.

లీగల్ చిక్కులు లేకుండా..

వివిధ విభాగాల సమన్వయంతో హైడ్రా పనిచేయనున్నందున, అదనపు సిబ్బందిని సమకూర్చనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. హైడ్రా విదివిధానాలు, దాని చట్ట పరిధి, సంక్రమించే అధికారాలు.. ముసాయిదాను ఫైనల్ చేసిన తర్వాత వెల్లడి కానున్నాయి. ఇప్పటికే చెరువులు, కుంటలు, నాలాలు తదితరాలన్నింటి ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ వివరాలను హైడ్రా సేకరించింది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలోని ప్రభుత్వ స్థలాలు, పార్కులు తదితరాలపైనా డేటా సిద్ధంగా ఉన్నది. ఇకపైన కొత్తగా కట్టడాలకు సంబంధిత మున్సిపల్, పంచాయతీరాజ్ విభాగాల నుంచి అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటే హైడ్రా దగ్గరకు వెళ్లి క్లియరెన్స్ వచ్చిన తర్వాతనే అనుమతులు జారీ అయ్యే వ్యవస్థ త్వరలో ఉనికిలోకి రాబోతున్నట్లు సచివాలయ వర్గాల సమాచారం. లీగల్ చిక్కులకు తావు లేకుండా, హైకోర్టులో పిటిషన్లు దాఖలై ఇబ్బందులు తలెత్తకుండా లా డిపార్టుమెంటు అన్ని కోణాల నుంచి ఆలోచించి ఆచితూచి అడుగులేస్తున్నది. ఇప్పటివరకు కట్టిన కట్టడాల విషయంలో కబ్జాలు, ఆక్రమణలపై దృష్టి పెడుతూనే ఇక నుంచి కొత్తగా ఉనికిలోకి రానున్న భవనాల నిర్మాణం విషయంలో ముందుగానే నివారణ చర్యలు తీసుకునేలా హైడ్రాకు ప్రభుత్వం దిశానిర్దేశం చేయనున్నది.

కబ్జాలు జరగకుండా మానిటరింగ్..

హైడ్రా మెకానిజం ఎలా పనిచేయాలో ఇప్పటికే కమిషనర్‌కు ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. వివిధ విభాగాలు, శాఖల మధ్య సమన్వయంపైనా ప్రభుత్వానికి స్పష్టమైన అభిప్రాయం ఉన్నది. భవిష్యత్తులో అక్రమ నిర్మాణాలకు తావు లేకుండా, ప్రభుత్వ ఆస్తులు కబ్జాకు గురికాకుండా, ప్రకృతి వనరులైన చెరువులు, కుంటలు మాయం కాకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నది. హైదరాబాద్ సిటీకి చుట్టుపక్కల ఉండే అన్ని చెరువులు, కుంటల దగ్గర సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నది. కబ్జాలు జరగకుండా నిరంతరం మానిటర్ చేసే మెకానిజంకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ఫుటేజి ఆధారంగా కబ్జాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే సంబంధిత ప్రభుత్వ విభాగాల సిబ్బంది అప్రమత్తమై నివారణ చర్యలు చేపడతారు. అవసరమైతే హైడ్రా రంగంలోకి దిగుతుంది. ఆ తరహాలోనే కొత్తగా అక్రమ నిర్మాణాలకు వీలు లేని లీగల్ మెకానిజం హైడ్రా వ్యవస్థ ద్వారా తొందరలో ఉనికిలోకి వచ్చేలా లా డిపార్టుమెంటు చట్ట సవరణ కోసం ముమ్మరంగా కసరత్తు చేస్తున్నది.

బిల్డింగ్ పర్మిషన్లు బంద్?

రాష్ట్రంలో ఇండ్ల నిర్మాణాలకు అనుమతుల జారీ నిలిచిపోయిందనే ప్రచారం జరుగుతున్నది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో నెల రోజుల నుంచి ఫైళ్లు పెండింగ్ లో ఉన్నట్టు పలువురు బిల్డర్లు చెబుతున్నారు. ఇంతకు ముందులా స్పీడ్ గా ఫైళ్లు కదలడంలేదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అయితే ఈ విషయంపై జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులను సంప్రదించగా ‘ఫైళ్లు ఎక్కడా ఆగడం లేదు. ఫైళ్ల పరిశీలన, పరిష్కారం యథావిధిగా కొనసాగుతున్నది’ అని తెలిపారు. అయితే ఇధే విషయంపై మాజీ మంత్రి కేటీఆర్ ఇటీవల ట్వీట్ చేశారు.


Similar News