సీఎం కేసీఆర్ టేబుల్ పై మరో కొత్త పుస్తకం!

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే టార్గెట్‌గా తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలు ప్రారంభించారు.

Update: 2022-09-09 08:01 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే టార్గెట్‌గా తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలు ప్రారంభించారు. బీజేపీ అవలంభిస్తున్న విధానాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలని పిలుపునిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ దూకుడుకు కళ్లెం వేయాలని భావిస్తున్న ఆయన పలు అంశాల వారీగా పుస్తకాలను తిరగేస్తున్నారనే చర్చ ఆసక్తిని రేపుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు రచించిన పుస్తకాలు కేసీఆర్ టేబుల్ మీద దర్శనం ఇవ్వగా తాజాగా సీఎం కేసీఆర్ ఇంట్లో ప్రముఖ వ్యాసకర్త, రచయిత, రాజకీయ వ్యాఖ్యాత ఆకార్ పటేల్ రచించిన 'ప్రైస్ ఆఫ్ ది మోడీ ఇయర్స్' అనే పుస్తకం దర్శనం ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ పుస్తకంలోని కీలకమైన డేటా ఆధారంగా బీజేపీ సర్కార్‌ను ఇరుకున పెట్టేలా కేఆర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర మంత్రిగా మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం మంత్రి గంగుల కమలాకర్ సీఎం కేసీఆర్‌ను ప్రగతి భవనన్‌లో కలుసుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలో ముఖ్యమంత్రి టేబుల్‌పై ఆకార్ పటేల్ రచించిన ప్రైస్ ఆఫ్టర్ మోడీ ఇయర్స్ అనే పుస్తకం కనిపించడం చర్చనీయాంశంగా మారింది.

గణాంకాలతో అడ్డుకునే ప్లాన్:

రాబోయే ఎన్నికల్లో బీజేపీని నిలువరించే ప్రయత్నంలో భాగంగా సీఎం కేసీఆర్ అనేక అంశాలను తరచూ ప్రస్తావిస్తున్నారు. ముఖ్యమంగా చరిత్ర, దేశ ఆర్థికాభివృద్ధి, వ్యవసాయం, విద్యుత్ రంగం ఇలా ఆయా రంగాల వారీగా మోడీ ప్రభుత్వాన్ని తూర్పార బడుతున్నారు. ఇందుకోసం కేసీఆర్ మేధావులు, మాజీ ఉద్యోగుల, సామాజిక వేత్తల నుంచి కీలకమైన సమాచారాన్ని సేకరిస్తున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా కేసీఆర్ టేబుల్‌పై కనిపించిన పుస్తకం రచయిత ఆకార్ పటేల్ చాలా కాలంగా రాజకీయ పరిణామాలను దగ్గరగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా నరేంద్ర మోడీ హయాంలో భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ తీరు తెన్నులపై డేటా మరియు వాస్తవాలను వివరించడానికి అతను ప్రయత్నిస్తున్నాడు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక బీజేపీ నిర్ణయాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ, జాతీయ భద్రత, సమాఖ్యవాదం, విదేశీ సంబంధాలు, చట్టాలు, న్యాయవ్యవస్థ, మీడియాపై ఆంక్షలు, పౌర సమాజానికి రాజకీయాలలో జరిగిన నష్టాన్ని ఆకార్ పటేల్ ఈ పుస్తకంలో గణాంకాలతో సహా వివరించారు. ముఖ్యంగా పుస్తకం కవర్ పేజీపైన అంతర్జాతీయ సూచికల ద్వారా భారతదేశం యొక్క పనితీరుకు సంబంధించిన 16 చార్ట్‌లు ముద్రించారు. ఇందులో ప్రజాస్వామ్యం, మానవాభివృద్ధి సూచిక, వ్యక్తిగత హక్కులు, న్యాయ పాలన, పత్రికా స్వేచ్ఛ, మహిళల భద్రత, శ్రేయస్సు, పౌర హక్కులు, అవినీతి మరియు సామాజిక ఐక్యత వంటి అంశాల్లో భారత్ రోజురోజుకూ దిగజారిపోతున్న ర్యాంకులను వివరించారు. ముఖ్యంగా నోట్ల రద్దుపై హడాహుడి నిర్ణయాలు, దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కోసం నాలుగు గంటల ముందు నోటీసులు ఇవ్వడం వంటి చర్యలను ప్రస్తావించారు. కరోనా సమయంలో ఆక్సిజన్ అందించలేకపోవడం వంటి అంశాలను వివరించారు. మేకిన్ ఇండియా అట్టహాసంగా ప్రారంభించిన అనంతరం భారత జీడీపీ తయారీ రంగం వాటా 16 శాతం నుండి 13కు తగ్గడం తయారీ రంగంలో ఉపాధి 2016 తర్వాత 5.1 కోట్ల నుంచి 2.7 కోట్లకు పడిపోవడం, కార్పొరేట్ వ్యక్తులకు ప్రభుత్వం రక్షణ కల్పించడం, దేశ చరిత్రలో తొలిసారి శ్రామిక శక్తి పాకిస్తాన్ కంటే తక్కువ నమోదు కావడం ఎత్తిచూపారు. గత ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రారంభించిన 19 పథకాలను వాటికి మోడీ ప్రభుత్వం పేరు మార్చడం వంటి వివరాలను పొందుపరిచారు.

బీజేపీని అడ్డుకునేదుకు సమాచార సేకరణ:

ఈ లెక్కల ఆధారాలతోనే సీఎం కేసీఆర్ బీజేపీపై విరుచుకుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల సీఎం పాల్గొన్న పలు బహిరంగ సభల్లో ప్రధాని మోడీ అసమర్థ, అవివేక పాలకుడు అంటూ ఘాటు విమర్శలు చేస్తున్నాడు. దేశాన్ని పూర్తిగా నాశం చేశారని ఒక్కసారి మోసపోతే అనేక ఏళ్లు పోరాటం చేయాల్సి ఉంటుందని ప్రజలు ఇకనైనా ఆలోచన చేయాలని పిలుపునిస్తున్నారు. కేసీఆర్ విమర్శల వెనుక ప్రగతి భవన్‌లో దర్శనమిచ్చిన ఈ పుస్తకంలోని గణాంకాలే ఆధారం అనే టాక్ వినిపిస్తోంది. గతంలో 'ఐ యామ్ ఏ ట్రోల్', 'ఇండియా ఆఫ్టర్ గాంధీ' అనే పుస్తకాలు కేసీఆర్ పరిశోధించినట్లు టాక్ వినిపించింది. తాజాగా ఆయన టేబుల్ ముందు ఆకార్ పటేల్ రచించిన ప్రైస్ ఆఫ్టర్ ద మోడీ ఇయర్స్ అనే పుస్తకం దర్శనం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న వేళ బీజేపీ, దాని భావజాలానికి వ్యతిరేకమైన బుస్తకాలు ప్రగతి భవన్‌లో దర్శనం ఇస్తుండటం రాజకీయ వర్గాల్లో ఆకస్తిని రేపుతోంది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో బీజేపీని నిలువరించేందుకు కేసీఆర్ గట్టి ప్రయత్నమే చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ ప్రయత్నాలు ఏ మేరకు ఫలితాలు ఇస్తాయో వేచి చూడాలి.

Tags:    

Similar News