డిజిటల్ కార్డుల విషయంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు

న్యూ ఇయర్ నాటికి ఫ్యామిలీ డిజిటల్ కార్డులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు షురూ చేసింది.

Update: 2024-09-26 01:36 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: న్యూ ఇయర్ నాటికి ఫ్యామిలీ డిజిటల్ కార్డులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు షురూ చేసింది. మొదటి దశలో ప్రతి నియోజకవర్గంలోని ఒక గ్రామం, ఒక పట్టణ ప్రాంతంలో పైలెట్ ప్రాజెక్టుగా కార్డులను పంపిణీ చేయనున్నారు. వాటిపనితీరును వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు. అయితే ప్రస్తుతం హర్యానా, రాజస్థాన్, కర్నాటక రాష్ట్రాల్లో డిజిటల్ కార్డులు అమల్లో ఉన్నాయి. కార్డుల పనితీరుపై ఆధ్యయనం చేసేందుకు త్వరలో ఆఫీసర్ల టీమ్ ఆ రాష్ట్రాల్లో పర్యటించనుంది.

అన్ని వివరాలు కార్డుల్లోనే

డిజిటల్ కార్డుల్లో ఫ్యామిలీ మెంబర్ల వివరాలు నమోదు చేయనున్నారు. ఒక్కొక్కరి హెల్త్ ప్రొఫైల్, ప్రభుత్వం నుంచి అందుకుంటున్న సంక్షమే పథకాల వివరాలు, ఇంటి, వ్యవసాయ భూముల వివరాలు కూడా కార్డులో పొందపరిచే అవకాశం ఉంటుందని తెలుస్తున్నది. దీంతో ప్రతి ఫ్యామిలీకి సంబంధించిన పూర్తి డేటా ఒకే దగ్గరగా ఉండటం వల్ల, వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేయడం సులువుగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ డిజిటల్ కార్డులు భవిష్యత్ లో అర్హులైన వారికే సంక్షేమ పథకాలు అందచేసేందుకు ఒక ప్రమాణికంగా ఉండే చాన్స్ ఉంటుందని, లీకేజీ అరికట్టే అవకాశం ఉంటుందని అఫీసర్లు అభిప్రాయపడుతున్నారు. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ఎంపిక చేసిన గ్రామాలు,పట్టణాల్లోని ఫ్యామిలీ వివరాలు, హెల్త్ ప్రొఫైల్ వివరాలను కార్డుల్లోకి అప్ లోడ్ చేసేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. అయితే హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలంటే, వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఆరోగ్య వివరాలు సేకరించాల్సి ఉంటుంది. అందుకోసం ప్రత్యేకంగా ఓ టీమ్ ను ఏర్పాటు చేయాలని హెల్త్ డిఫార్ట్ మెంట్ భావిస్తోంది.

యూఎస్ తరహాలో డిజిటల్ కార్డులు

యూఎస్ లో ప్రతి పౌరుడికి ఒక సోషల్ సెక్యూరిటీ కార్డు ఉంటుంది. అందులో వ్యక్తికి చెందిన పూర్తి డిటేయిల్స్ ఉంటాయి. హెల్త్ ప్రొఫైల్, వెహికల్స్,ఆస్తుల చిట్టా మొత్తం ఉంటుంది. రాష్ట్రంలో కూడా దాదాపుగా ఆ తరహాలో ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తున్నది. అందుకోసం ఎంత ఖర్చు అయిన పర్వాలేదన్న నిర్ణయానికి ఆయన వచ్చినట్టు సమాచారం. ఒకసారి ఫ్యామిలీ వివరాలు సేకరించి, డిజిటలైజేషన్ చేయడం వల్ల ప్రభుత్వం అందించే స్కీమ్స్ అమలు పారదర్శకంగా, ఉపయోగకరంగా ఉంటుందన్న అభిప్రాయంలో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది.

చివరికి రేషన్ వివరాలు అప్ లోడ్

డిజిటల్ కార్డుల్లో ముందుగా ప్యామిలీ మెంబర్స్ హెల్త్ ప్రొఫైల్, అందుకుంటున్న సంక్షేమ పథకాల వివరాలను చేర్చనున్నారు. ఆ తరువాత రేషన్ కార్డుకు సంబంధించిన వివరాలను ఆప్ లోడ్ చేస్తారు. ఆ సమయంలోనే ఫ్యామిలీ మెంబర్లకు చెందిన ఆస్తుల వివరాలు నమోదు చేసే అవకాశం ఉందని ఓ సీనియర్ ఆఫీసర్ వెల్లడించారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రస్తుతం అమల్లో ఉన్న రేషన్ కార్డుల ద్వారానే బియ్యం పంపిణీ చేయనున్నారు.


Similar News