తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం.. పోలీసులు రంగంలోకి దిగడమే ఆలస్యం!
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం వరుస కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి భిన్నంగా పనిచేస్తోంది.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం వరుస కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి భిన్నంగా పనిచేస్తోంది. ఈ క్రమంలోనే మరో కీలక నిర్ణయం తీసుకుంది. హుక్కా కేంద్రాలపై నిషేధం విధించాలని నిర్ణయించింది. ఈ నెల 4వ తేదీన జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకోగా.. నిన్న అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారికంగా ప్రకటించారు. డ్రగ్స్ కేసుల్లో పట్టుబడే యువతలో ఎక్కువ మంది హుక్కా కేంద్రాలకు వెళ్తున్నట్లు గుర్తించామని, అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఒక్క హైదరాబాద్ నగరంలోనే సుమారు 200 లకు పైగా హుక్కా కేంద్రాలు ఉన్నట్లు అధికారులు, పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
కాగా, తెలంగాణను డ్రగ్స్ లేని రాష్ట్రంగా మారుద్దామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణలోకి ఎవరైనా డ్రగ్స్‌తో ఎంటర్ కావాలంటే కాళ్లు వణికిపోవాలని చెప్పారు. డ్రగ్స్ నివారణకు పోలీసులంతా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని సూచించారు. యువతపై కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని.. చెడు సావాలసాలకు పోయి ఆరోగ్యాన్ని పాడుచేసుకొని, కుటుంబాన్ని రోడ్డున పడేయొద్దని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు డ్రగ్స్, హుక్కా కేంద్రాలపై దాడులకు సిద్ధమయ్యారు.