రాష్ట్ర ప్రజలు త్వరలోనే శుభవార్త వింటారు.. డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు
డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో ఆర్థిక పరమైన అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయాలి కాబట్టి ఆగస్టు 15 లోపు పంట రుణ మాఫీ చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తాము ఇచ్చిన హామీలను నిజం చేస్తూ త్వరలోనే రాష్ట్ర ప్రజలు, రైతాంగం శుభవార్త వింటారని అన్నారు. తాజాగా ఓ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన భట్టి.. రైతు రుణమాఫీకి రేషన్ కార్డు లింక్ విషయంలో వివాదం అనేది అవగాహన లేని వారు, అర్థం పర్థం లేకుండా రాజకీయాలు చేస్తూ బతకాలనుకునే వారు మాట్లాడే మాటలు ఇవన్నీ అని ధ్వజమెత్తారు. గతంలో రుణమాఫీ విషయంలో ఎలాంటి విధానం అనుసరించాయో అదే తరహాలో రుణమాఫీ చేస్తామన్నారు. మొన్నటి వరకు రుణమాఫీ ఎలా చేస్తారు? నిధులు ఎలా తెస్తారని మాట్లాడిన వారు తీరా రుణమాఫీకి ప్రభుత్వం సిద్ధం కాగానే కొత్త వాదనలు తెరపైకి తీసుకువస్తున్నారని విమర్శించారు. చెప్పిన మాట ప్రకారం చేసి చూపిస్తామన్నారు. గత ప్రభుత్వం పదేళ్లుగా ఉద్యోగాల భర్తీ చేయకుండా నిర్లక్ష్యం వహించిందని ధ్వజమెత్తారు. డీఎస్సీ నిర్వహించకుండా సరిగ్గా ఎన్నికల సమయంలో నోటిఫికేషన్ ఇచ్చిందని కానీ తాము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించామన్నారు. విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్ ను మాత్రమే సుప్రీంకోర్టు మార్చమని చెప్పింది తప్ప విచారణ ఆపమని చెప్పలేదన్నారు. ప్రోటోకాల్ విషయంలో బీఆర్ఎస్ వాదన దయ్యాలు వేదాలు వల్లిచ్చినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.