గుడ్ న్యూస్.. రాష్ట్రంలో పెట్టుబడులకు మరో బడా కంపెనీ గ్రీన్ సిగ్నల్

రాష్ట్రానికి మరో బడా కంపెనీ పెట్టుబడులకు ముందుకు వచ్చింది.

Update: 2024-06-13 14:27 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రానికి మరో బడా కంపెనీ పెట్టుబడులకు ముందుకు వచ్చింది. మెడికల్‌ టెక్నాలజీలో ప్రముఖ అంతర్జాతీయ సంస్థగా పేరొందిన ఒలింపస్‌ కార్పొరేషన్‌ హైదరాబాద్‌లో తన ఆర్‌ అండ్‌ డీ ఆఫ్‌షోర్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ (ఓడీసీ) ఏర్పాటు చేసేందుకు సముఖత వ్యక్తం చేసింది. అమెరికాలోని న్యూయార్కులో గురువారం కంపెనీ ఒలింపస్‌ కార్పొరేషన్‌ గ్లోబల్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (ఆర్‌‌అండ్‌డీ) సయ్యద్‌ నవీద్‌ మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో భేటీ అయ్యారు. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ సంస్థతో కుదిరిన వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా ఒలింపస్‌ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఒలింపస్ కార్పొరేషన్ పెట్టుబడులకు ముందుకు రావడం తెలంగాణకు ఒక మైలురాయిగా పేర్కొన్నారు. కంపెనీకి పూర్తి సహాయసహకారాలు అందజేస్తామన్నారు. పెట్టబడులకు తెలంగాణను ఎంచుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు రానున్నాయని, అత్యాధునిక సాంకేతికతలతో పని చేయడానికి, వైద్య సాంకేతికతలో ప్రపంచ ఆవిష్కరణలకు దోహదపడే వేదికను అందిస్తుందన్నారు. ఈ సంస్థ మరిన్ని పెట్టుబడులు, సహకారాలను ప్రోత్సహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, శక్తి నాగప్పన్, అండ్రూ రోగన్ తదితరులున్నారు.


Similar News