పొంగులేటి విషయంలో Congress అనూహ్య నిర్ణయం

ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయం అంతా ఉమ్మడి ఖమ్మం జిల్లా చుట్టే తిరుగుతోంది.

Update: 2023-01-20 07:32 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయం అంతా ఉమ్మడి ఖమ్మం జిల్లా చుట్టే తిరుగుతోంది. బీఆర్ఎస్ ఆవిర్భావ సభతో గులాబీ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంటే కేసీఆర్ నేషనల్ పాలిటిక్స్ ప్రయత్నం అట్టర్ ఫ్లాప్ అయిందని బీజేపీ, కాంగ్రెస్‌లు విమర్శలు గుప్పిస్తున్నాయి. బీఆర్ఎస్ ఖమ్మం సభ మాట ఎలా ఉన్నా అందరి దృష్టి మాత్రం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపైనే ఉంది. బీఆర్ఎస్ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న పొంగులేటి రాజకీయ ప్రయాణం ఎటువైపు అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఆయన బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పి త్వరలో కాషాయ తీర్థం పుచ్చుకుంటారనే టాక్ జోరుగా వినిపిస్తోంది. ఈ మేరకు ఆయన త్వరలో అమిత్ షాతో భేటీ అయి తన నిర్ణయం వెల్లడిస్తారనే ప్రచారం కూడా జరిగుతోంది.

అయితే అనూహ్యంగా పొంగులేటికి కాంగ్రెస్ నుంచి ఆహ్వానం రావడంతో రాజకీయం మరింత రసవత్తరంగా మారుస్తోంది. నిన్న మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ సీనియర్ నేత, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతానంటే అందుకు తాను అడ్డుగా రానని స్పష్టం చేశారు. పొంగులేటిని పార్టీలోకి సాధరంగా ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. కాంగ్రెస్ పార్టీలోకి ఎక్కువ మంది చేరాలనేదే తన అభిప్రాయం అని చెప్పుకొచ్చారు. దీంతో పొంగులేటికి ఇప్పటికే బీజేపీ నుంచి లైన్ క్లియర్ ఉండగా తాజాగా ఉమ్మడి ఖమ్మం కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉన్న భట్టి విక్రమార్క నుంచి సైతం నో అబ్జెక్షన్ రావడంతో ఆయన నిర్ణయం ఎలా ఉండబోతోందనేదానిపై సస్పెన్స్ నెలకొంది.

బీఆర్ఎస్‌లో ఇన్నాళ్లు తనకు జరిగిన అవమానాలపై రగిలిపోతున్న పొంగులేటి.. ఇక తన సత్తా ఏంటో చాటాలని డిసైడ్ అయినట్టు ఆయన అనుచరుల వద్ద వినిపిస్తున్న మాట. ఇందుకోసం తాను తీసుకోబోయే అడుగు బీఆర్ఎస్‌కు గట్టి షాక్ ఇచ్చేదిగా ఉండేలా ప్రణాళికలు వేసుకుంటున్నారని, పెద్ద ఎత్తున తన అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలను తనతో పాటే వెంట తీసుకువెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. తన అనుచరులంతా రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తారని ఇప్పటికే అనౌన్స్ చేసిన శ్రీనివాస్ రెడ్డి.. ఆ మేరకు తాను చేరబోయే పార్టీ పెద్దల వద్ద ప్రామిస్ తీసుకున్న తర్వాతే స్టెప్ ముందుకు వేసేందుకు పావులు కదుపుతున్నారని రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది. అన్ని సజావుగా జరిగితే వచ్చే నెలలో బీఆర్ఎస్ సభను మైమరిపించే రీతిలో ఖమ్మంలో భారీగా సభ నిర్వహించి అదే సభలో తాను రాజకీయ కండువా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

Also Read...

రేవంత్ రెడ్డి.. బట్ట కాల్చి మీద వేస్తుండు: గుత్తా సుఖేందర్ రెడ్డి 

Tags:    

Similar News