బాసర ట్రిపుల్‌ ఐటీ ఇంచార్జి వీసీపై ఎంక్వైరీ వేయాలి.. డిప్యూటీ సీఎంకు ఓయూ జేఏసీ నేతల వినతి

బాసర ట్రిపుల్ ఐటీ ఇంచార్జి వీసీ వేంకట రమణ అనేక అక్రమాలు చేశారని, ఆయన మీద ఏసీబీ లేదా విజిలెన్స్ ఎంక్వైరీ ద్వారా విచారణ జరిపించాలని ఓయూ విద్యార్థి జేఏసీ నేతలు డిమాండ్ చేశారు.

Update: 2024-10-05 11:47 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బాసర ట్రిపుల్ ఐటీ ఇంచార్జి వీసీ వేంకట రమణ అనేక అక్రమాలు చేశారని, ఆయన మీద ఏసీబీ లేదా విజిలెన్స్ ఎంక్వైరీ ద్వారా విచారణ జరిపించాలని ఓయూ విద్యార్థి జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కని శనివారం వారు కలిసి వినతి పత్రం అందజేశారు. విద్యార్థి జేఏసీ నేతలు సర్దార్ వినోద్ కుమార్, పేరాల ప్రశాంత్, రంజిత్ కుమార్, ప్రవీణ్, దిలీప్ జిల్లపెల్లి, శేఖర్ యాదవ్, వికాస్ యాదవ్ తదితరులు భట్టిని కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ -2 గా, బాసర ట్రిపుల్ ఐటీ ఇంచార్జి వీసీగా బీఆర్ఎస్ హయాంలో నియమితులై, జోడుపదవుల్లో ఉంటూ అనేక అక్రమాలకు పాల్పడిన వెంకట రమణను తక్షణమే ఇన్చార్జి వీసీ పదవి నుంచి తొలగించాలని వారు కోరారు. ఆయన చేసిన నకిలీ బిల్లుల చెల్లింపులపై అలాగే తన దగ్గర సంబంధికులకు అక్రమంగా ఉద్యోగాలు కట్టబెట్టి లక్షల రూపాయల జీతాలు కట్టబెట్టారని వారు ఆరోపించారు.

ఇంచార్జి వీసీ తనకు లొంగని మహిళ ఉద్యోగులను వేధించి తొలగించిన ఘటనలు ఉన్నాయని ఆరోపించారు. తనకు నచ్చిన వారికి అర్హతలు లేకున్నా ఉద్యోగాలు ఇచ్చారని, చేయని పనులకు చేసినట్టు బిల్లులు తీసుకుంటూ, పాత పెండింగ్ బిల్లులను ఆర్‌జీయూకేటీ నుంచి చెల్లించి పర్సంటేజ్‌లు తీసుకుంటున్నారని వారు తీవ్ర ఆరోపణలు చేశారు. ఆలాగే కాలం ముగిసిన తర్వాత కూడా అవే మెస్ కాంట్రాక్టర్‌లను కొనసాగిస్తూ పేద విద్యార్ధులకు చెందాల్సిన డబ్బులను తన సొంత అవసరాలకు వాడుకుంటున్నారని, అవసరం లేకున్నా నూతన వాహనాలు కొనుగోలు చేసి తన ఇంటికి వాడుకుంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, ఇలా అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని ఇంచార్జి వీసీపై విజిలెన్స్ ఎంక్వైరీ వేసి విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ఓయూ విద్యార్థి జేఏసీ నేతలు డిప్యూటీ సీఎం భట్టికి విజ్ఞప్తి చేశారు. 


Similar News