తెలంగాణ పర్యటనకు అమిత్ షా.. షెడ్యూల్ ఖరారు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు రానున్నారు
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఈ మేరకు ముహూర్తం ఖారారు అయింది. ఈ నెల 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా రాష్ట్రానికి అమిత్ షా రానున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకోసం ఒక్కరోజు ముందే అమిత్ షా హైదరాబాద్ రానున్నారు. ఈ మేరకు అమిత్ షా పర్యటన షెడ్యూల్‌ను బీజేపీ వర్గాలు విడుదల చేశాయి.
16వ తేదీన రాత్రి 7.55 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి అమిత్ షా చేరుకోనున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా సీఆర్పీఎఫ్ సెక్టార్స్ ఆఫీసర్స్ మెస్‌కు చేరుకోనుండగా.. రాత్రి అక్కడే బస చేయనున్నారు. ఇక 17న ఉదయం పరేడ్ గ్రౌండ్‌లో జరగనున్న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో అమిత్ షా పాల్గొంటారు. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించనున్న సభలో అమిత్ షా ప్రసంగించనున్నారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో అమిత్ షా ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. సీఎం కేసీఆర్ టార్గెట్‌గా ఎలాంటి విమర్శలు చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది.
ఈ పర్యటన సందర్భంగా తెలంగాణ బీజేపీ నేతలతో అమిత్ షా సమావేశమయ్యే అవకాశముంది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావాహుల నుంచి బీజేపీ దరఖాస్తులు ఆహ్వానించింది. దీంతో అభ్యర్థుల ఖరారుపై కూడా అమిత్ షా చర్చించనున్నారని తెలుస్తోంది.