లక్ష్యాన్ని మించి పనిచేసిన టీ-బీజేపీ నేతలు.. అమిత్ షా హర్షం

రాష్ట్రంలో ‘ప్రజా గోస – బీజేపీ భరోసా’ పేరుతో జరిగిన కార్యక్రమాలను, దానిలో భాగంగా ‘శక్తి కేంద్రాల’లో జరిగిన స్ట్రీట్ కార్నర్ మీటింగుల పట్ల కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంతృప్తి వ్యక్తం చేశారు.

Update: 2023-02-28 16:40 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ‘ప్రజా గోస – బీజేపీ భరోసా’ పేరుతో జరిగిన కార్యక్రమాలను, దానిలో భాగంగా ‘శక్తి కేంద్రాల’లో జరిగిన స్ట్రీట్ కార్నర్ మీటింగుల పట్ల కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంతృప్తి వ్యక్తం చేశారు. నిర్దిష్ట గడువులో 11 వేల మీటింగులను జరపాలని నిర్ణయం తీసుకున్నా దానికంటే అదనంగా 123 నిర్వహించినందుకు రాష్ట్ర నాయకులను అభినందించారు. ఫిబ్రవరి 10న మొదలైన స్ట్రీట్ కార్నర్ మీటింగులు మంగళవారంతో ముగిశాయి. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను, కేంద్ర ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడంపై ప్రశంసలు కురిపించారు. రాష్ట్ర యూనిట్‌లోని నాయకులంతా సమిష్టిగా పనిచేసి సక్సెస్ చేసినందుకు భేష్ అంటూ అభినందించారు. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని రాష్ట్ర నాయకులు ఇచ్చిన ఫీడ్ బ్యాక్‌తో ఇదే స్ఫూర్తితో ఇకపైన కూడా పనిచేయాలంటూ రాష్ట్ర నేతలకు సూచించారు.

స్ట్రీట్ కార్నర్ మీటింగుల నిర్వహణ సందర్భంగా కొద్దిమంది బీజేపీ కార్యకర్తలపై అధికార బీఆర్ఎస్ స్థానిక కార్యకర్తలు దాడులు చేసిన విషయాన్ని రాష్ట్ర నేతలు అమిత్ షా దృష్టికి తీసుకెళ్ళారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బాన్సువాడ సహా కొడంగల్, వరంగల్ టౌన్, హైదరాబాద్‌లని పలు ప్రాంతాల్లో, మహబూబాబాద్, బోధన్, సత్తుపల్లి లాంటి నియోజకవర్గాల్లో స్ట్రీట్ కార్నర్ మీటింగులను బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారని, పోలీసులు కూడా ఆంక్షలు పెట్టారని అమిత్ షా కు వివరించారు. వీటన్నింటినీ అధిగమిస్తూ లక్ష్యంకంటే ఎక్కువ మీటింగులు నిర్వహించిన పట్టుదలను కొనియాడారు.

Tags:    

Similar News