వీడిన సస్పెన్స్.. రెండు తెలుగు రాష్ట్రాల కేంద్ర మంత్రులకు దక్కిన శాఖలివే..!

కేంద్రంలో ముచ్చటగా మూడోసారి కొలువుదీరిన ఎన్డీఏ సర్కార్‌లో ఎవరికి ఏ శాఖ దక్కుతుందోనన్న తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు మోడీ

Update: 2024-06-10 15:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలో ముచ్చటగా మూడోసారి కొలువుదీరిన ఎన్డీఏ సర్కార్‌లో ఎవరికి ఏ శాఖ దక్కుతుందోనన్న తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు మోడీ 3.0 కేబినెట్‌లోని నూతన మంత్రులకు శాఖలు కేటాయింపు పూర్తి అయ్యింది. ప్రధాని మోడీ అధ్యక్షతన ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో కొత్తగా నియామకమైన కేంద్ర మంత్రులకు పోర్ట్ ఫోలియోలను అప్పగించారు. కీలకమైన హోం శాఖ, రక్షణ, ఆర్థిక, విదేశీ వ్యవహారాల శాఖల్లో ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదు. మోడీ 2.0 కేబినెట్‌లో ఈ బాధ్యతలు చూసిన వారికే తిరిగి మళ్లీ ఆ శాఖలను కేటాయించారు. మరోసారి హోంమంత్రిగా అమిత్ షా, రక్షణ మంత్రిగా రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జై శంకర్‌కే పదవులు అప్పగించారు. ఇక, రెండు తెలుగు రాష్ట్రాలకు ఈ సారి ఐదు కేంద్ర మంత్రి పదవులు దక్కాయి.

అందులో రెండు కేబినెట్ హోదా కాగా, మరో మూడు సహయ మంత్రి పోస్టులు. అయితే, ఈ ఐదుగురికి ఏ శాఖలు దక్కుతాయోనని రెండు తెలుగు స్టేట్‌లలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆ ఉత్కంఠకు ఇవాళ ఎట్టకేలకు తెరపడింది. తెలంగాణ ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఏపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాసా వర్మలకు కేంద్రం శాఖలు కేటాయించింది. కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ, బండి సంజయ్‌కు హోం శాఖ సహయ మంత్రి, రామ్మోహన్ నాయుడుకి పౌరవిమానయాన, పెమ్మసానికి కమ్యూనికేషన్, గ్రామీణాభివృద్ధి సహయ మంత్రి, శ్రీనివాసా వర్మకు ఉక్కు పరిశ్రమ సహయ మంత్రి పోస్టులు కేటాయించారు. దీంతో తెలుగు రాష్ట్రాలకు ఏ శాఖలకు దక్కుతాయన్న సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడింది.


Similar News