కాంగ్రెస్, టీఆర్‌ఎస్ మధ్య పొత్తు..? ప్రశాంత్ కిషోర్ భారీ వ్యూహం
దిశ, తెలంగాణ బ్యూరో: హస్తినలో మారుతున్న రాజకీయ పరిణామాలు రాష్ట్రంలో కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. సోనియా శిబిరంలో ఎన్నికల
దిశ, తెలంగాణ బ్యూరో: హస్తినలో మారుతున్న రాజకీయ పరిణామాలు రాష్ట్రంలో కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. సోనియా శిబిరంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వరుస భేటీలపై రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య పొత్తుపై ఊహాగానాలు బలపడుతున్నాయి. ఇప్పటి వరకైతే రాష్ట్రంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య పొత్తు ఉండదని రాహుల్ గాంధీ కుండబద్దలు కొట్టారు. కానీ, వ్యూహకర్త వ్యూహాల్లో ఏఐసీసీ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నట్లు జాతీయ మీడియా కూడా కథనాలు ప్రసారం చేస్తోంది. దీంతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే చర్చ మొదలైంది. మొన్నటిదాకా కేసీఆర్‌తో చెట్టపట్టాలేసుకు తిరిగిన ప్రశాంత్ కిషోర్.. ఇప్పుడు ఈ రెండు పార్టీలు కలిస్తేనే రాష్ట్రంలో బీజేపీ దూకుడుకు బ్రేక్ వేయవచ్చనే సూచన చేస్తే కేసీఆర్ సిద్ధంగా ఉంటారని అంచనా వేస్తున్నారు. గతంలోనే తన పార్టీని కాంగ్రెస్‌లు విలీనం చేస్తానని మాటిచ్చిన కేసీఆర్.. ఇప్పుడు అదే పార్టీకి ఉనికి లేకుండా చేశారన్న చర్చ రాజకీయవర్గాల్లో ఇప్పటికే ఉన్నది. రాష్ట్రంలో బీజేపీ బలంగా మారుతున్నదనే సంకేతాల నేపథ్యంలో కాంగ్రెస్‌తో కలిసేందుకు కేసీఆర్ వెనకాడబోరని తెలుస్తున్నది. అవకాశం వచ్చినప్పుడల్లా కేసీఆర్.. కాంగ్రెస్‌ను వెనకేసుకొస్తూనే ఉన్నారు. తాజాగా ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పక్కన చేరడం, అక్కడ ఆయనకు కీలకపదవి కట్టబెడుతున్నట్టు జరుగుతున్న ప్రచారంతో రాష్ట్రంలో రాజకీయపరిస్థితులు మారుతున్నాయి.
అల్రెడీ కమిట్మెంట్
పీకే సహాయం పొందిన వారి జాబితాలో ఉన్నవారిలో స్టాలిన్, ఉద్దవ్ ఠాక్రే ఎప్పటి నుంచో యూపీఏలో కొనసాగుతున్నారు. శరద్ పవార్, ఉద్దవ్ ఠాక్రే ఇద్దరూ కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. హేమంత్ సోరేన్ కూడా అంతే. ఇక ప్రశాంత్ కిషోర్ జాబితాలో ఉన్న ఏపీలో జగన్, పశ్చిమ బెంగాల్లో మమతకు కాంగ్రెస్‌తో పని లేదన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ వ్యూహంలో భాగంగా బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను కూడగట్టేందుకు కేసీఆర్ కూడా ఇటీవల రాష్ట్రాలు తిరిగారు. జార్ఖండ్ వెళ్లి హేమంత్ సోరేన్‌ను కలిశారు. అంతకు ముందు స్టాలిన్, శరద్ పవార్, ఉద్దవ్ ఠాక్రేలనూ కలిసొచ్చారు. కేసీఆర్ వెళ్లి వచ్చిన తర్వాతే శరద్ పవార్ కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ లేని కూటమి సాధ్యం కాదని పేర్కొన్నారు. ఆ తర్వాత కేసీఆర్ ఢిల్లీ బాట పట్టినా.. ఆశించిన ఫలితం రాలేదని టీఆర్‌ఎస్ వర్గాలే చెప్తున్నాయి.
పొత్తు కుదిరేనా?
రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ఉన్నారంటూ సీఎం కేసీఆరే ఇటీవల స్వయంగా ప్రకటించారు. కేసీఆర్ ఏ పార్టీ పేరైతే పలికేందుకు కూడా ఇష్టపడరో.. అదే పార్టీ శిబిరంలో పీకే చర్చలు పెట్టాడు. వాస్తవంగా రాష్ట్రంలో కాంగ్రెస్ బలంగా మారుతున్నదని ఇటీవల పలు సర్వేల్లో కేసీఆర్‌కు కూడా అర్థమైందని టాక్. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మాత్రమే బలమైన ప్రత్యర్థిగా మారుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి. అంతకు ముందు అసోం సీఎం హేమంత బిశ్వశర్మ ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ ఖండించారు. రాహుల్‌ను సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. అప్పటి వరకు కాంగ్రెస్ అంటేనే పడని కేసీఆర్ ఒక్కసారిగా ఈ తరహా మద్దతు ప్రకటించడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది.
మద్దతు అవసరమేనంటూ పీకే ప్రతిపాదనలు
జాతీయ స్థాయిలో బీజేపీని దెబ్బకొట్టాలంటే కాంగ్రెస్ కూటమితోనే సాధ్యమని పీకే తేల్చి చెప్పినట్లు తెలుస్తున్నది. ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో పీకే బృందం సర్వే చేసింది. ఆ తర్వాతే ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ శిబిరంలో ప్రత్యక్షమయ్యారు. కాంగ్రెస్ సైతం ఒక విధంగా పీకేకు ఎర్ర తివాచీ పరిచింది. పీకే చేసిన ప్రతిపాదనలపై ఏకంగా ఓ కమిటీని వేసింది. ప్రియాంక గాంధీ నేతృత్వంలో పార్టీ సీనియర్లు అంబికా సోనీ, దిగ్విజయ్ సింగ్, చిదంబరం, సూర్జేవాలా, కేసీ వేణుగోపాల్ తో కమిటీ వేసి ప్రతిపాదనలపై అభిప్రాయం చెప్పాలని రెండు రోజుల గడువు విధించింది. దీంతో సోనియా.. పీకే ప్రతిపాదనలపై సానుకూలంగా ఉన్నారనే సంకేతాలొచ్చాయి. ప్రాంతీయ పార్టీల మద్దతు కాంగ్రెస్ కు చాలా అవసరమంటూ పీకే సోనియాకు వివరించినట్టు తెలుస్తున్నది. ఇందులో భాగంగానే రెండు తెలుగు రాష్ట్రాలతోపాటుగా దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో కలిసేందుకు కాంగ్రెస్ మొగ్గు చూపుతున్నట్లు రాజకీయ విశ్లేషకుల అంచనా. ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదనల ప్రకారం తెలంగాణలో టీఆర్‌ఎస్, ఏపీలో వైసీపీ కూడా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటాయనే అభిప్రాయాలున్నాయి. దీనికి తోడుగా రాష్ట్రంలో పీకే టీం ఇటీవల చేసిన సర్వేల్లో టీఆర్‌ఎస్ పై వ్యతిరేకత, కాంగ్రెస్‌పై సానుకూలత పెరిగిందనే నివేదికను సిద్ధం చేసిచ్చారంటున్నారు. దీంతో ఇరు పార్టీల మధ్య పొత్తు ఉంటే బీజేపీని అడ్డుకోవచ్చని పీకే వ్యూహంగా అంచనా వేస్తున్నారు.