బీజేపీలోనే కాదు కాంగ్రెస్, బీఎస్పీలోనూ KCR కోవర్టులు: మాజీ IAS ఆకునూరి మురళి సంచలన వ్యాఖ్యలు
దుర్మార్గపు రాజకీయాలు చేయడంలో కేసీఆర్ ప్రపంచంలోనే పెద్ద మేధావి అని.. ఆయన రాజకీయాలను మనం ఊహించడం కష్టం అని మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి అన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: దుర్మార్గపు రాజకీయాలు చేయడంలో కేసీఆర్ ప్రపంచంలోనే పెద్ద మేధావి అని.. ఆయన రాజకీయాలను మనం ఊహించడం కష్టం అని మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి అన్నారు. బుధవారం దిశ టీవికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ తనకు ఉన్న టైమ్‌లో 99 శాతం రాజకీయాలు చేయడం కోసమే ఉపయోగిస్తాడని.. ప్రత్యర్థి పార్టీల్లో కోవర్టులు ఉంచడం అనేది కేసీఆర్‌కు చాలా సులభమైన పని అన్నారు. బీజేపీలో మాత్రమే కాదు కాంగ్రెస్, బీఎస్పీ అన్ని పార్టీల్లో కేసీఆర్ కోవర్టులు ఉన్నారని.. రేపు జాగో తెలంగాణలోనూ తన కోవర్టులను పెడతాడని అన్నారు.
పొంగులేటి, జూపల్లి బీజేపీకి వెళ్లే పిచ్చి పని చేయరని అనుకుంటున్నానని, వారిద్దరు కొత్త పార్టీ పెట్టడం కంటే కాంగ్రెస్‌లోకి వెళ్లడమే బెటర్ అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య అవగాహన ఒప్పందం వల్లే కవిత అరెస్ట్ జరగడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయం అని.. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్, బీజేపీ ఏకం అవుతాయన్నారు.
రాష్ట్రంలో ఉపఎన్నికలు అన్ని తమాష మాత్రమేనని ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిల చేత కావాలనే రాజీనామా చేయించి బీజేపీ నెంబర్ టూ అనేది క్రియేట్ చేయించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ మూడు పార్టీలు ఒకే తాను ముక్కలన్నారు. కర్ణాటక ఫలితాలతో యాంటీ బీజేపీ, యాంటీ బీఆర్ఎస్ శక్తులన్ని ఒకేచోటకు వస్తాయన్నారు.
ఎలక్షన్ల కోసమే బీఆర్ఎస్ రాక్షస ముఠా దశాబ్ది ఉత్సవాల పేరుతో హాడావుడి చేస్తోందని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ నెంబర్ వన్ అబద్దాల కోరు అని.. రాష్ట్రంలో అబద్ధాల పరిపాలన నడుస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో వెలమ దొరల పరిపాలనలో దుర్మార్గం అంతా ఇంతా కాదన్నారు. ధరణి పేరుతో కేసీఆర్ నాటకాలు ఆడుతున్నాడని.. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గొప్పలు చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వానికి దమ్ముంటే ఆ ప్రాజెక్టు ద్వారా ఏయే గ్రామంలో ఎన్ని ఎకరాలు సాగునీరు ఇచ్చారో ఆ వివరాలను వెబ్ సైట్‌లో పెట్టాలని డిమాండ్ చేశారు.
గడిచిన తొమ్మిదేళ్లలో 30 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసిన ఈ ప్రభుత్వం మరో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు పేపర్ లీకేజీలు రకరకాల ఇబ్బందులు సృష్టిస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసిన దుర్మార్గుడు కేసీఆర్ అని మండిపడ్డారు. 9 ఏళ్లలో ఒక్క నిమిషం కూడా విద్యారంగంపై ముఖ్యమంత్రి రివ్యూ మీటింగ్ పెట్టలేదని మండిపడ్డారు.