అమిత్ షా, కేసీఆర్‌ల మధ్య ఢిల్లీలో కీలక ఒప్పందం: మహేష్ కుమార్ గౌడ్
అమిత్ షా, కేసీఆర్‌ల మధ్య ఢిల్లీలో కీలకమైన ఒప్పందం జరిగినట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో: అమిత్ షా, కేసీఆర్‌ల మధ్య ఢిల్లీలో కీలకమైన ఒప్పందం జరిగినట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. ఆదివారం ఆయన సోషల్ మీడియాలో బీజేపీ, బీఆర్ఎస్ ఒప్పందాలపై ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేయాలనే లక్ష్యంతో వారిద్దరి మధ్య ఒప్పందం కుదిరినట్లు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసేందుకు కృషి చేయాలని అమిత్ షా కేసీఆర్‌కు సూచించినట్లు తమకు స్పష్టమైన సమాచారం ఉందని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఇక సీనియర్ నాయకుడు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు.
కేసీఆర్ నుంచి మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు రూ. 25 కోట్లు ముడుపులు వచ్చినట్లు ఈటల ఆ వాస్తవాన్ని ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కార్‌పై కాంగ్రెస్ నిరంతరం పోరాటం చేస్తోందని, అవినీతి దోపిడీలపై క్రమం తప్పకుండా ప్రశ్నిస్తూనే ఉన్నదని మహేష్ కుమార్ గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తప్పిదాలను ప్రశ్నిస్తూనే ఉన్నదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్‌ను ఇంటికి పంపించే ప్రక్రియలో కాంగ్రెస్ ఉన్నదని, ఇది తమతోనే సాధ్యమైతుందని ఆయన నొక్కి చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్లు కలిసి ఎన్ని కుట్రలకు పాల్పడిన తమ లక్ష్యాన్ని నీరు కార్చబోమని మరోసారి వెల్లడించారు. పేద ప్రజల గుండెల్లో కాంగ్రెస్ ఉన్నదని, తమ పార్టీని బద్నాం చేయాలని చూస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఖరిని స్పష్టంగా అర్థం చేసుకుంటారన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గడీల పాలనకు గండి కొడతామని హెచ్చరించారు.