Indira Mahila Shakti Bhavans : ఇందిరా మహిళా శక్తి భవన్ లకు రూ.110 కోట్లతో పరిపాలన అనుమతులు
దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాల(Indira Mahila Shakti Bhavans) నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిపాలన అనుమతులు(Administration approvals) మంజూరీ చేసింది. ఒక్కో భవన నిర్మాణానికి రూ.5 కోట్ల చొప్పున 22 భవనాల నిర్మాణానికి రూ.110 కోట్లు మంజూరు చేశారు. స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు జిల్లా కేంద్రాల్లో ఇందిరా మహిళా శక్తి భవన్ లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. . పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈ భవనాలు నిర్మించనున్నారు. ఆయా జిల్లాల్లో మహిళ స్వయం సహాయక సంఘాలు వీటి నుంచి కార్యకలాపాలు సాగించనున్నాయి. ఇందిరా మహిళ శక్తి భవన్ లలో శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.
మహిళలకు ఆసక్తి ఉన్న రంగాల్లో శిక్షణ ఇవ్వడంతో పాటు స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్, కామన్ వర్క్‌షెడ్, ఉత్పత్తుల ప్రదర్శన మేళాలు, జీవనోపాధి, ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ తదితర కార్యకలాపాలు వీటిలో నిర్వహించనున్నారు. ఈనెల 19న హన్మకొండ జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవ సభలో ఈ భవనాల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.