అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు క్షణాల్లో చేరుకోవాలి : ఎస్పీ గౌస్ ఆలం

అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు పోలీసులు క్షణాల్లో

Update: 2024-10-15 12:55 GMT

దిశ,ఉట్నూర్ : అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు పోలీసులు క్షణాల్లో చేరుకుని శాంతి భద్రతలను అదుపు చేయాల్సిన బాధ్యత ఉందని ఎస్పీ గౌస్ ఆలం అన్నారు. మంగళవారం ఎస్పీ గౌస్ ఆలం వార్షిక తనిఖీల్లో భాగంగా ఉట్నూర్ పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. ఎస్పీ రాకతో డీఎస్పీ నాగేందర్, సీఐ మొగిలి ఎస్పీ కి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. పోలీసుల నుంచి ఎస్పీ గౌరవ వందనం స్వీకరించారు.డీఎస్పీ,సీఐ కార్యాలయాలను తనిఖీ చేశారు. కార్యాలయాలాల్లో రికార్డులను పరిశీలించారు. క్రైమ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీసు స్టేషన్ లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా అందుబాటులోకి తేవాలని ఎస్పీ సూచించారు. సబ్ డివిజన్ పరిధిలో ఆదివాసీలతో మమేకమై ఉంటుందని, ఆదివాసీల గ్రామాలను సందర్శిస్తూ సత్సంబంధాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఆదివాసులకు ఎలాంటి అవసరాలైన అందుబాటులో ఉంటూ సహాయ సహకారాల అందించాలన్నారు.

ఆదివాసీల అమాయకులను మోసం చేసే విధంగా ఎలాంటి దళారులను నమ్మకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండాలని, ముఖ్యంగా యువత చెడు వ్యసనాల బారిన పడకుండా, గంజాయి పండించడం, రవాణా, సేవించడం, లాంటి వాటికి అలవాటు పడకుండా చూడాలన్నారు. ప్రస్తుత సైబర్ నేరగాళ్లు ఉపయోగిస్తున్న నూతన విధానాలపై చైతన్యపరుస్తూ అవగాహన కల్పించాలన్నారు. ప్రజలతో మమేకమై ఉంటూ పోలీస్ స్టేషన్ కి వచ్చే ప్రతి ఒక్క ఫిర్యాదుదారుల సమస్యలపై నిషితంగా పరిశీలిస్తూ, పరిష్కరిస్తూ న్యాయం చేకూరే విధంగా అధికారులను కేటాయించాలని తెలిపారు. సబ్ డివిజనల్ పరిధిలో ఆసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపే దిశగా విధులను నిర్వర్తించాలని, నిఘా వ్యవస్థను పటిష్టం చేసుకుని సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేస్తూ ఉండాలన్నారు. రికార్డుల నిర్వహణ, కేసుల పరిశోధన, దర్యాప్తు వేగవంతం చేస్తూ ఎటువంటి పెండెన్సీ లేకుండా చూడాలని, సిబ్బంది విధులపై నిరంతరం పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని సూచించారు. ఎస్పీ వెంట ఉట్నూర్ డీఎస్పీ సీహెచ్ నాగేందర్, సీఐలు మొగిలి, రహీం పాష, ఎస్ఐలు మనోహర్, రమణ, సిబ్బంది ఉన్నారు.


Similar News