ఉపాధ్యాయ నియామకాల్లో అవకతవకలు..పలు ఉపాధ్యాయ సంఘాల నాయకుల అరెస్ట్

మొన్న వెలువడిన డీఎస్సీ ఫలితాలలో ఉత్తమ ర్యాంకులు సాధించిన

Update: 2024-10-15 15:09 GMT

దిశ,ఆదిలాబాద్ : మొన్న వెలువడిన డీఎస్సీ ఫలితాలలో ఉత్తమ ర్యాంకులు సాధించిన వారికి కాకుండా తక్కువ ర్యాంకులు సాధించిన వారికి పోస్టింగులు ఇస్తూ ఆదిలాబాద్ డీఈఓ కార్యాలయంలో కార్యాలయ సిబ్బంది అవకతవకలకు పాల్పడ్డారని పలువురు ఉపాధ్యాయులు మంగళవారం ఆందోళన చేపట్టారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించి బాధ్యతలపై చర్యలు తీసుకోవడంతో పాటు జాబితాలోని తప్పులను సవరించాలని, బాధిత అభ్యర్థులతో పాటు బీసీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. డీఎస్సీలో నియామకమై ఆర్డర్ తీసుకున్న అభ్యర్థులకు పోస్టింగ్ కోసం డీఈవో కార్యాలయంలో కౌన్సిలింగ్ కు ఏర్పాట్లు చేశారు.

ఉదయం 10 గంటలకు అభ్యర్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అయితే కౌన్సిలింగ్ రద్దు అయిందని, వచ్చిన వారు హాజరు సంతకం చేసి వెళ్లిపోవాలని, తర్వాత కౌన్సిలింగ్ నిర్వహించే తేదీని చెబుతామని కార్యాలయ సిబ్బంది తెలిపారు. కాగా అభ్యర్థులు హాజరు వేసుకొని తిరిగి వెళ్తున్న క్రమంలో మళ్లీ డివో కార్యాలయం నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగుతుందని చెబుతూ మెసేజ్ చేశారు. దీంతో అభ్యర్థులు పరుగు పరుగున డీఈవో కార్యాలయానికి చేరుకున్నారు. ఇది ఇలా ఉంటే జిల్లా స్థాయిలో రెండు, 12 ర్యాంకుల సాధించిన తమకు ఉద్యోగాలు రాలేదని, తక్కువ ర్యాంకులు ఉన్న వారికి పోస్టులు ఎలా వచ్చాయని బాధితులు డివో కార్యాలయంలో సిబ్బందిని నిలదీశారు. అదేవిధంగా ఓ మహిళ అభ్యర్థి ఎస్టీగా ఉండగా ఆమెకు ఎస్సీ కేటగిరీలో ఎంపిక చేశారు. తాను ఎస్సీ కాదని చెబుతున్న పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు.

విషయం తెలుసుకున్న పలు ఉపాధ్యాయ సంఘం నాయకులతో పాటు బీసీ సంక్షేమ సంఘం నాయకులు అక్కడికి చేరుకొని, బాధితులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇదే విషయమై డీఇఓ ప్రణీతను ఆమె చాంబర్లో నిలదీశారు. డైరెక్టర్ కార్యాలయం నుంచి తప్పిదం జరిగిందని డివో చెప్పడంతో వారు ఏకీభవించలేదు.పోస్టింగ్ ముందు ఖాళీల వివరాలు, ఆప్షన్లు, స్వీకరించకుండా కౌన్సిలింగ్ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. కౌన్సిలింగ్ ప్రక్రియను వాయిదా వేసి, తప్పులను సరిదిద్దిన తర్వాత నిర్వహించాలని డిమాండ్ చేశారు. దీంతో కార్యాలయ సూపరింటెండెంట్ కూడా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని, ఆయనను కూడా సస్పెండ్ చేయాలని ఆందోళనకు దిగారు.

డీఎస్సీ నియామకాల్లో కలెక్టర్ చైర్మన్ గా, డీఈఓ కన్వీనర్ గా ,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, జడ్పీ సీఈఓలు సభ్యులుగా ఉంటారన్నారు. వారి సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించాలని పట్టు బట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు డీఈవో కార్యాలయానికి చేరుకొని ఆందోళన చేస్తున్న బీసీ సంఘాల నాయకులు, పలువురు ఉపాధ్యాయులతో మాట్లాడిన వారు వెనుకడుగు వేయలేదు. ఎట్టకేలకు డీఈవో తో మాట్లాడి అవకతవకలకు పాల్పడకుండా,అర్హులైన అభ్యర్థులకు పోస్టింగులు ఇవ్వాలని, లేనియెడల ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇందులో పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులతో పాటు కొత్త అభ్యర్థులు, ఉపాధ్యాయులు ఉన్నారు. అయితే ఇందులో కొందరు ఉపాధ్యాయ సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేయడంతో ఆయా పోలీస్ స్టేషన్ ల వద్ద ఆందోళన నెలకొంది.


Similar News