సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూడాలి : బీఆర్ఎస్ ఎమ్మెల్యే

Update: 2023-09-08 13:20 GMT

దిశ, మంచిర్యాల: ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూడాలని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు సూచించారు. శుక్రవారం లక్షెట్టిపేట లోని కళాంజలి ఫంక్షన్ హాలు లో జరిగిన లక్షెట్టిపేట, దండేపల్లి మండలాల బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సంక్షేమ పథకాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసే ప్రజాప్రతినిధులకు రాజకీయ భవిష్యత్తు ఉండదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. అర్హులకు సంక్షేమ పథకాలు అందించడం ద్వారా పార్టీకి మంచి పేరే కాకుండా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గులాబీ జెండా నే ఎగురుతుందని వివరించారు.

సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మనకు అనుకూలంగా ఉన్నాయని, ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలని కోరారు. ప్రజల ఆధారాభిమానాలు ఉండటంతోనే తాను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని గుర్తు చేశారు. అహంకారం, అహంభావం ఉంటే ప్రజలు తనకు ఓట్లు వేసేవారా అని ప్రశ్నించారు. ఇతర పార్టీలను అనరాని మాటలు మనం అనాల్సిన పనిలేదని, ప్రజలకు బీఆర్ఎస్ పథకాలను వివరిస్తూ ప్రజాక్షేత్రంలో దూసుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగయ్య, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, లక్షెట్టిపేట మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య, వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, నడిపల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్ కుమార్ రావు, తదితరులు పాల్గొన్నారు.


Similar News