ఆగని అక్రమాలు..యథేచ్ఛగా రేషన్ బియ్యం దందా...

రేషన్ బియ్యం దందా యథేచ్ఛగా కొనసాగుతోంది.

Update: 2025-03-21 02:10 GMT
ఆగని అక్రమాలు..యథేచ్ఛగా రేషన్ బియ్యం దందా...
  • whatsapp icon

దిశ,ఆదిలాబాద్ : రేషన్ బియ్యం దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు. తరచూ అధికారులు పట్టుకుంటున్న ఆగడం లేదు. రేషన్ బియ్యం బస్తాలకు చక్రాలు అమరుస్తూ అక్రమార్కులు పక్క రాష్ట్రానికి తరలిస్తున్నారు. ఈ దందాలో అధికారులకు సైతం వాటాలు ఉండటం వల్ల అడ్డుకట్ట పడటం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం పోలీసులకు మాత్రమే ఈ రేషన్ బియ్యం పట్టుబడటం పలు అనుమానాలకు తావిస్తోంది. సంబంధిత శాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం తోనే అక్రమార్కులు రెచ్చిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

290 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం..

ఆదిలాబాద్ జిల్లాలోనే కాకుండా నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలోనూ ఈ రేషన్ బియ్యం దందా పెద్ద ఎత్తున కొనసాగుతోంది. రేషన్ బియ్యం అక్రమ దందాకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రాన్ని కేంద్ర బిందువుగా చేసుకున్న అక్రమార్కులు విచ్చలవిడిగా గుట్టుచప్పుడు కాకుండా రేషన్ బియ్యాన్ని పక్క రాష్ట్రానికి తరలిస్తున్నారు. ఇందులో భాగంగానే పోలీసులు ముందస్తు సమాచారం మేరకు అనుమానం వచ్చిన వాహనాలను స్థానిక మండలం కేంద్రం వద్ద జాతీయ రహదారిపై వారం రోజుల క్రితం ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. వారి అనుమానాలను నిజం చేస్తూ ఏకంగా ఆదిలాబాద్ జిల్లా నుంచి మహారాష్ట్రకు 290 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వాహనాన్ని ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో జైనథ్ సీఐ ఆధ్వర్యంలో చెక్ పోస్ట్ వద్ద పట్టుకున్నారు. బోరజ్ అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద 44వ జాతీయ రహదారిపై పోలీసులు వాహనాన్ని తనిఖీ చేయగా 290 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. దీని విలువ సుమారు 15 లక్షల రూపాయల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

జైనథ్ సీఐ సాయినాథ్ ఎస్సై పురుషోత్తం సిబ్బందితో కలిసి మాటు వేసి పట్టుకున్న ఈ రేషన్ బియ్యం విషయమై విచారణ చేయగా. అక్రమార్కులు మధ్యప్రదేశ్ లోని బాల ఘాటుకు రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు తెలుసుకున్నారు. ఈ కేసులో డ్రైవర్ తాహిర్ తో పాటు లారీ యజమాని ఎండి నజీమ్, బియ్యం సరఫరా చేస్తున్న నాగనాథ్ షఫీ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే పట్టుకున్న బియ్యాన్ని ఎన్ఫోర్స్మెంట్ తాసిల్దార్ రాథోడ్ రవీందర్ కు సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకొని పంచ నామాలు నిర్వహించారు. ఇది ఇలా ఉంటే కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోనూ రేషన్ బియ్యం ఎక్కువగా పక్కదారి పడుతుంది. సరిహద్దు ప్రాంతం మీదుగా మహారాష్ట్రకు రేషన్ బియ్యాన్ని అక్రమార్కులు జోరుగా తరలిస్తుండడంతో జిల్లాలో రేషన్ బియ్యం అక్రమార్కులకు అడ్డు అదుపు లేకుండా పోయింది.

వారం రోజుల క్రితం నిరుపేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని లబ్ధిదారుల వద్ద తక్కువ రేటుకు కొని మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్నారు. అన్న విషయం జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు నిఘా అధికారుల సమాచారం ద్వారా తెలుసుకొని మాటువేసి పట్టుకున్నారు. అయితే ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాస్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ అధికారులకు అందిన పక్కా సమాచారంతో మాటు వేసి పట్టుకోవడం తో పెద్ద మొత్తంలో మహారాష్ట్రకు తరలిపోతున్న బియ్యాన్ని వారు స్వాధీనం చేసుకున్నారు. ఇదే జిల్లాలోని కెరమెరి మండలంలోని వివిధ గ్రామాల నుంచి సేకరించిన బియ్యాన్ని మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు మాటువేసి అనార్ పల్లి వద్ద భానోత్ విజయ్ కుమార్ బొలెరో వాహనంతో తీసుకు వెళుతున్న 8 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

నిర్మల్ జిల్లాలోనూ..

నిర్మల్ జిల్లాలోనూ ఇటీవలే భారీగా రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. బైంసా పట్టణానికి చెందిన పీడీఎస్ బియ్యం గా గుర్తించిన అధికారులు వెంటనే సంబంధిత డీటీ సివిల్ సప్లై అధికారులకు సమాచారం అందజేశారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఈ బియ్యం సుమారు 30 టన్నుల పైనే ఉంటుందని తెలియజేశారు. ఈ బియ్యం సైతం పక్కన ఉన్న మహారాష్ట్ర కు తరలిస్తున్నట్లు వారు విచారణలో తెలిసిందన్నారు. నెల వ్యవధిలోనే పెద్ద మొత్తంలో రేషన్ బియ్యం పోలీసులకు పట్టుబడటం చూస్తే ముమ్మాటికీ ఇది అధికారుల నిర్లక్ష్య మేనని, సంబంధిత శాఖ అధికారుల పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ ప్రాంతంలో 20 క్వింటాళ్ల ప్రభుత్వ రాయితీ బియ్యంను అక్రమంగా తరలిస్తున్న క్రమంలో బుధవారం అర్ధరాత్రి ఉట్నూర్ ఎ ఎస్పి కాజల్ సింగ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.వీటి విలువ సుమారు రూ 40 వేల విలువ ఉంటుందని పోలీసులు తెలిపారు.

పట్టించుకోని అధికారులు..

పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో నిరు పేద ప్రజలకు రేషన్ షాపుల ద్వారా అందించాల్సిన పీడీఎస్ బియ్యం పక్కదారి పడుతున్న సంబంధిత శాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అక్రమ రేషన్ బియ్యం తరలింపుపై అధికారులు దృష్టి సారించకపోవడంతో అక్రమార్కులు పేదల బియ్యాన్ని మహారాష్ట్రకు తరలిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే ఈ బియ్యాన్ని అమాయక ప్రజల నుంచి రేషన్ దుకాణదారులే తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు అక్రమార్కులకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై సంబంధిత ఆదిలాబాద్ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారిని సంప్రదించగా... అక్రమ బియ్యం తరలింపు పై పూర్తిగా దృష్టి సారిస్తున్నామని, ఎవరైనా అక్రమంగా బియ్యం తరలించినట్లు సమాచారం ఇస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.


Similar News