ఆహారం...హాలాహలం
అధికారులు తమ ఉద్యోగ ధర్మం నిర్వహించడంలో పూర్తిగా విఫలమవుతున్నారు.
దిశ, ఆసిఫాబాద్ : అధికారులు తమ ఉద్యోగ ధర్మం నిర్వహించడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. వారి నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం కారణంగా అమాయక జనాలు బలవుతున్నారు. ఇందుకు ఉదాహరణ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలు, రెస్టారెంట్లు, హోటళ్లు. ఇటీవల జరిగిన వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలే నిదర్శనం.
నేటి ఆధునిక జీవనశైలి లో ఇంట్లో వండుకొని తినేంత టైం లేక, వీకెండ్స్ లో ఫ్యామిలీతో అలా బయిటికెళ్లి రెస్టారెంట్,హోటళ్లలో తినడానికి జనాలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. దీన్ని అదునుగా తీసుకుని ఫుడ్ వ్యాపారులు రెచ్చిపోతు న్నారు. హోటల్, రెస్టారెంట్లో రాత్రి మిగిలిపోయిన మటన్. చికెన్ లను ఫ్రీజ్ ల్లో నిల్వ ఉంచి మరుసటి రోజు వాడుతున్నారు. కొందరైతే పాడైన మాంసాన్ని కలర్ ఫుల్ గా తయారు చేసి, ఆర్డర్ ఇచ్చిన నిమిషాల్లోనే వేడివేడిగా తెచ్చి వడ్డిస్తున్నారు. ఇలా హోటల్, రెస్టారెంట్లో సర్వం కల్తీచేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.
నిషేధిత పదార్థాల వినియోగం
ప్రభుత్వం నిషేధించిన మయో నైజ్ జిల్లాలోని హోటల్, రెస్టారెంట్లో యథేచ్ఛగా వినియోగిస్తున్నారు. పరిమితికి మించి ఫుడ్ కలర్స్, టేస్టింగ్ సాల్ట్ లను సైతం అడ్డగోలుగా వాడుతున్నారు. ఆరోగ్యానికి హానికరమైనదని తెలిసినా టేస్టింగ్ సాల్ట్ అధిక మోతాదులో వినియోగిస్తున్నారు. మరో వైపు నిల్వ ఉంచిన మాంసంతో పాటు నిషేధిత హానికర పదార్థాలను వండటం, నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో ఫుడ్ పాయిజన్ అవుతుంది.
అధికారుల పర్యవేక్షణ లోపం...ఒకరు బలి
రెస్టారెంట్లు, దాబాలు, హోటళ్లతో పాటు ఆహార పదార్థాలు విక్రయించే దుకాణాలను స్థానిక మున్సిపల్, పోలీస్ అధికారులతో కలిసి నిత్యం తనిఖీలు చేసి ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించాల్సిన ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టనట్లు ఉంటున్నారు. వీరి పర్యవేక్షణ లోపంతో ఫుడ్ పాయిజన్ తో నిర్మల్ జిల్లాలో ఓ యువతి మృతి చెందగా, మరికొందరు అస్వస్థతకు గురయ్యారు. ఇదే తరహాలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ పట్టణంలోని ఓ రెస్టారెంట్ లో ఇటీవల మండి బిర్యాని తిని పలువురు యువకులు అస్వస్థతకు గురై హాస్పిటల్ పాలయ్యారు.
నిర్మల్ జిల్లాలో యువతి మృతితో ఫుడ్ సేఫ్టీ అధికారులు మేల్కొని ఫుడ్ పాయిజన్ కు కారణమైన గ్రీల్ 9 హోటల్ ను సీజ్ చేశారు. సీజ్ చేసేముందు హోటల్ రీయూస్ట్ ఆయిల్ తో పాటు కాలం చెల్లిన వస్తువులను ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. అయితే ముందు నుంచే అధికారులు తనిఖీలు చేస్తూ తమ ఉద్యోగ ధర్మం సక్రమంగా చేసి ఉంటే యువతి ప్రాణాలు కోల్పోయి ఉండేది కాదని ప్రజలు వాపోతున్నారు. ఇక కొమురం భీం జిల్లాలో ఫుడ్ పాయిజన్ జరిగిన రెస్టారెంట్ల పై చర్యల మాట అటుంచి,..అధికారులు కనీసం తనిఖీ చేసిన పాపాన పోలేదు. ప్రజారోగ్య పరిరక్షణలో జిల్లాలో కీలక పాత్ర పోషించాల్సిన ఫుడ్ సేఫ్టీ అధికారుల పనితీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పక్క జిల్లాల అధికారులు స్పందించి కొంతమేరకు చర్యలు తీసుకోగా, మన జిల్లా అధికారులు ఇంకా మేల్కోలేదని ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.