ఏళ్లు గడుస్తున్నా తీరని తాగునీటి సమస్య.. ఆదివాసుల అవస్థలు

స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆదివాసులకు

Update: 2024-11-13 02:13 GMT

దిశ, ఆదిలాబాద్ : స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆదివాసులకు మాత్రం పూర్తిస్థాయిలో స్వాతంత్రం సంగతి అటు ఉంచితే సౌకర్యాలు కూడా కల్పించలేని పరిస్థితి జిల్లాలో నెలకొంది. మారుమూల అటవీ ప్రాంతంలో నివసించే ఆదివాసి గ్రామాలు నేటికీ సమాజానికి దూరంగానే ఉంటున్నాయి.కానీ అటువంటి వారిని గుర్తించి,వారికి సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వాలే కాకుండా నేడు అధికారులు కూడా పూర్తిగా విఫలమవుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆదివాసి గ్రామాల్లోని ప్రజలు సరైన తాగునీరు లేక, పట్టించుకునే వారు రాక మురుగు నీరునే తాగునీరుగా వాడుతున్నారు ఆదిలాబాద్ జిల్లాలోని బేల మండలంలో పూసం గూడ గ్రామస్తులు.

మారుతున్న ప్రపంచంలో కనీస సౌకర్యాలలో గాలి తర్వాత తాగునీరు ఎంతో ముఖ్యమైనది. కానీ ఆ తాగు నీరు కొందరికి అనేక రకాలుగా లభిస్తున్న,బేల మండలంలోని పూసంగూడ గ్రామస్తులకు మాత్రం మురుగు నీరు తాగునీరుగా మారింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా బాహ్య ప్రపంచానికి దూరంగా,ఎక్కడో అటవీ ప్రాంతాలలో నివసిస్తున్న ఆదివాసులు నేటికీ మంచి నీటితో పాటు సరైన సౌకర్యాలకు నోచుకోవడం లేదు. రోడ్లు,విద్యుత్, రవాణా సౌకర్యం వంటి వాటి సంగతి అటు ఉంచితే మనిషి బతకడానికి అతి ముఖ్యమైన వనరులలో మంచినీరు కూడా వారికి అందుబాటులో లేకుండా పోయింది.

ఏళ్లు గడుస్తున్నా తీరని తాగునీటి సమస్య

ఎన్నికల ప్రచారాలలో ఓటర్లను ఆకట్టుకునే ప్రసంగాలు చేసే నేతలు గెలిచిన తర్వాత ప్రజల బాగోగులు పట్టించుకోక పోగా, కనీస సౌకర్యాలు కూడా కనిపించలేదు. దీంతో ఆదిలాబాద్ జిల్లాకు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న బేల మండలంలోని పూసంగూడ గ్రామంలో నివసించే 17 ఆదివాసి కుటుంబాలకు కనీసం మంచినీళ్లు కూడా అందించే ఆలోచన నేతలు, అధికారులు చేయకపోవడం గమనార్హం. తాము గెలిస్తే, లేదా అధికారంలోకి వస్తే ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడం తో పాటు సంక్షేమ పథకాలు అందిస్తామని గొప్ప గొప్ప హామీలు ఇచ్చే నేతలు మంచినీటి సౌకర్యం కూడా కల్పించడం లేదు. దీంతో పూసంగూడ గ్రామంలో నివసించే 17 కుటుంబాల ఆదివాసులు నేటికీ సరైన తాగునీరు లేక అనేక అవస్థలకు గురవుతు అనారోగ్యం పాలవుతున్నారు.

ఆ గ్రామంలో ఎప్పుడో ఏళ్ల కింద వేసిన చేతి పంపు ద్వారా వచ్చే నీటితో అవసరాలు తీర్చుకుంటున్న ఆ ప్రజలకు ఆ నీరు వెనుక అనారోగ్యం దాగి ఉందన్న విషయం గమనించలేకపోవడం బాధాకరం. కనీసం ఇంటి అవసరాలకు కూడా వినియోగించలేని స్థితిలో ఉన్న ఆ చేతి పంపు నీటిని తాగుతున్నామని ఆ గ్రామస్తులు చెబుతున్న తీరును చూస్తే ఇంకా వందేళ్లు వెనకే ఉన్నామా అన్న ఆలోచన కలుగుతుంది. కానీ బతకడానికి ఏదో ఒక నీరు కావాలని, అడవుల్లోకి వెళితే వాగు నీరు తాగి బతికే మాకు ఈ నీరు తప్ప వేరే దారి లేదని గ్రామస్తులు చెబుతున్న తీరుపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 10 ఏళ్లలో గత ప్రభుత్వం మిషన్ భగీరథ పైపులైన్ ఇచ్చింది..కానీ నీటి సరఫరా మాత్రం ఎప్పుడు వస్తుందో మాకు తెలియదని చెబుతున్నారు అక్కడి ప్రజలు. అలాంటి పరిస్థితుల్లో ఏళ్ల కింద వేసుకున్న చేతిపంపు ద్వారా ప్రస్తుతం వస్తున్న నీరు మురికి నీరుల కనిపిస్తున్న, నురగలు వస్తున్న తప్పనిసరి తాగాల్సి వస్తుందని అంటున్నారు.

పక్షం రోజులుగా సరఫరా కాని మిషన్ భగీరథ నీరు

రవాణా, విద్యుత్ సౌకర్యం లేకపోయినా తాగునీరు ఉంటే చాలనుకొని, మారుమూల గ్రామమైన భవాని గూడ గ్రామ పంచాయతీలోని పూసం గూడలో నివసిస్తున్న 17 ఆదివాసి కుటుంబాలకు ప్రస్తుత మిషన్ భగీరథ నీటి సరఫరా లేకపోవడం శాపంగా మారింది. ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు రాదో తెలియని వారికి ఆ గ్రామంలోని చేతి పంపు నీరే దిక్కవుతోంది. మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీటి ఇబ్బందులు తొలగిపోతాయని భావించిన, ఆదివాసులకు ఆ పథకం ఉన్నా నేడు అది ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి సందర్భంలో ప్రస్తుత ప్రభుత్వంలో నైనా జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క తో పాటు జిల్లా కలెక్టర్ తమ సమస్యను పరిష్కరించి మా ఆదివాసి అమాయక ప్రజలకు అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించి న్యాయం చేస్తే బాగుంటుందని గ్రామస్తులు కోరుతున్నారు.


Similar News