ఆరోగ్యకరమైన జీవనశైలిని విద్యార్థులకు అలవాటు చేయాలి
జిల్లాల్లోని అన్ని ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులు వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యకరమైన జీవన శైలిని వారికి అలవాటు చేయాలని, విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసం, సామాజిక నైపుణ్యాలు పెంపొందించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు.
దిశ, ఆదిలాబాద్ : జిల్లాల్లోని అన్ని ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులు వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యకరమైన జీవన శైలిని వారికి అలవాటు చేయాలని, విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసం, సామాజిక నైపుణ్యాలు పెంపొందించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. అందుకే ఆరోగ్య పాఠశాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మంగళవారం రిమ్స్ ఆసుపత్రిలోని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య పాఠశాల కార్యక్రమంపై సంబంధిత అధికారులతో జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం నెల 14 నుంచి అన్ని ఉన్నత పాఠశాలల్లో, కేజీబీవీ, ఇంటర్ కళాశాలల్లో ప్రారంభమవుతుందని తెలిపారు.
ఒక్కో వారం, ఒక్కో అంశాన్ని అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. 4 వారాల పాటు నిర్వహించే ఈ కార్యక్రమలో ప్రతి సోమవారం వ్యక్తిగత పరిశుభ్రత, ప్రతి మంగళవారం పోషకాహారంపై అవగాహన, ప్రతి బుధవారం ఒత్తిడి నివారించుకునే మార్గాలు, ప్రతి గురువారం డ్రగ్స్ కు దూరంగా ఉండడం, ప్రతి శుక్రవారం కాలానుగత వ్యాధుల నివారణ, ప్రతి శనివారం వ్యక్తిత్వ వికాసం అనే అంశాలపై విద్యార్థులకు అవగాహన కలిగించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగేలా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాధ్యత వహించాలని ఆదేశించారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే విద్యా నైపుణ్యాలను సాధించగలరని, అందుకోసం ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జైసింగ్, డీఎంహెచ్ ఓ నరేందర్ రాథోడ్, జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత, జిల్లా సంక్షేమ అధికారి సబిత పాల్గొన్నారు.