పొరపాట్లకు తావులేకుండా వివరాలు నమోదు చేయాలి
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల గణన సర్వేలో పొరపాట్లకు తావులేకుండా వివరాలు నమోదు చేయాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి కృష్ణ ఆదిత్య అన్నారు.
దిశ, ఆదిలాబాద్ : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల గణన సర్వేలో పొరపాట్లకు తావులేకుండా వివరాలు నమోదు చేయాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి కృష్ణ ఆదిత్య అన్నారు. జిల్లాలో పర్యటించిన ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి కృష్ణ ఆదిత్య మంగళవారం ఉట్నూర్ లోని దంతన్ పల్లి గ్రామం, బీర్సాయిపేట, అదిలాబాద్ లోని రిక్షా కాలనీ, ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ లలో కొనసాగుతున్న సర్వే తీరును జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా, అదనపు కలెక్టర్ శ్యామలా దేవి, సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్, ట్రెయిని కలెక్టర్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే లో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా కుటుంబ సభ్యుల వివరాలను స్పష్టంగా నమోదు చేయాలని తెలిపారు.
ఎన్యుమరేటర్లు తమకు కేటాయించిన బ్లాక్లలో పూర్తిస్థాయిలో కుటుంబ సభ్యుల వివరాలు, సర్వే ముందు రోజు ఏ ప్రాంతంలో సర్వే నిర్వహిస్తున్నారో ఆ ప్రాంత ప్రజలకు సమాచారం అందించాలని, ఇంటి యజమానులు అవసరమైన ఆధార్, రేషన్ కార్డులు, ధరణి పాస్ బుక్ పత్రాలతో సిద్ధంగా ఉండేలా వారికి తెలియజేయాలని సూచించారు. ఫారంలో ఉన్న ప్రశ్నలకు ఎన్యుమరేటర్లు ప్రతి అంశాన్ని తప్పనిసరిగా నింపాలని కోరారు. అంతకు ముందు బీర్సాయి పేట్ లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. బీర్సాయి పేట్, దంతన్ పల్లి, శాంతి నగర్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.
ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకువచ్చే సమయంలో తేమశాతం చూసుకోవాలని, నిబంధనలను తప్పనిసరిగా పాటించి ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధర పొందాలని కోరారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో గన్నీ సంచులు, టార్పాలిన్, తేమ యంత్రం, తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ధాన్యం ఏ గ్రేడ్ రకానికి రూ.2320,సాధారణ రకానికి 2300 రూపాయలు నిర్ణయించినట్టు చెప్పారు. ఆయన వెంట డీఎం సుధ, సివిల్ సప్లై అధికారి, డీఏఓ, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్, ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు, ఏపీఎం తదితరులు ఉన్నారు.