భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తం.. నేడు పాఠశాలలకు సెలవు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు.

Update: 2024-09-03 02:17 GMT

దిశ ప్రతినిధి, నిర్మల్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు ప్రాణ నష్టం జరగకుండా అధికార యంత్రాంగం చర్యలకు దిగింది. ఉమ్మడి జిల్లాలోని నిర్మల్ , ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయాలలో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. ఆయా జిల్లాల కలెక్టర్లు అదనపు జిల్లా కలెక్టర్లకు వర్షాల ప్రభావంపై ఎప్పటికప్పుడు కంట్రోల్ రూంల నుంచి అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలతో పాటు పోలీస్, వైద్యాధికారులతో సమీక్షిస్తున్నారు.

గోదావరి ఉగ్రరూపం..

రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తున్నది నిర్మల్ జిల్లా బాసర సమీపంలో మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి ప్రవేశించే ప్రదేశంలో గోదావరి నది ఉగ్రరూపం చూపుతున్నది బాసర జ్ఞాన సరస్వతి గోదావరి స్నాన ఘట్టాలు నీట మునిగిపోయాయి. గోదావరి నది పరివాహక ప్రాంతాల్లోకి పశువుల కాపరులను, మత్స్యకారులను అనుమతించడం లేదు. నిర్మల్ జిల్లాలోని బాసర, లోకేశ్వరం, దిలావర్పూర్, సోన్, లక్ష్మణ చందా, మామడ, ఖానాపూర్, కడం , దస్తురాబాద్, మంచిర్యాల జిల్లాలోని జన్నారం, దండేపల్లి మంచిర్యాల మండలాల పరిధిలో గోదావరి తీరం వెంబడి పోలీసు, రెవెన్యూ అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గంట గంటకు మైక్ అనౌన్స్ చేయిస్తున్నారు. ఎవరు కూడా గోదావరి వైపు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సోన్ వంతెన వద్ద శ్రీరాంసాగర్ గేట్లు ఎత్తడం తో పాటు నిర్మల్ జిల్లాలోని స్వర్ణ ప్రాజెక్ట్ గేట్లను సైతం ఎత్తడంతో రెండు వైపుల నుంచి పోటెత్తిన వరద నీటితో బ్రిడ్జి అంచులు దాటి వరద నీరు ప్రవహిస్తున్నది. ఈ వానాకాలం సీజన్ లో ఇంతటి వరద ఇదే మొదటిసారి.

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ సహా ఇతర జలాశయాల గేట్లు ఎత్తివేత...

ఉత్తర తెలంగాణ రైతాంగ సాగునీటి ప్రాజెక్టు శ్రీరాంసాగర్ 40 గేట్లు ఎత్తి లక్షన్నర క్యూసెక్కుల చొప్పున వరద నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. నిర్మల్ జిల్లాలోని కడెం, గడ్డన్న వాగు, స్వర్ణ ఆసిఫాబాద్ జిల్లాలోని కొమరం భీం అడ ప్రాజెక్టు, వట్టి వాగు ప్రాజెక్ట్, ఆదిలాబాద్ జిల్లాలోని సాత్నాల, మత్తడి వాగు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి వరద నీటిని కిందికి వదులుతున్నారు. ప్రాజెక్టులో వరద నీరు వాగుల్లోకి పెద్ద మొత్తంలో విడుదల చేయడంతో వాగులకు ఇరువైపులా ఉన్న పంట పొలాలు నీట మునిగిపోయాయి. కడెం ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సందర్శించారు గతంలో కడెం ప్రాజెక్టు కారణంగా జరిగిన తీవ్ర ఆస్తి నష్టం తో పాటు ప్రాణనష్టాన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.

జిల్లా కలెక్టర్ ఎస్పీ సహా ఇతర అధికారులతో ఆయన మాట్లాడి పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని సూచించారు. కాగా ఎగువ మహారాష్ట్ర నుంచి భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో స్వర్ణ ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల లు సందర్శించారు. కాగా ఆదిలాబాద్ జిల్లాలో పెన్ గంగ ఉధృతిని అక్కడి జిల్లా కలెక్టర్ రాజార్షి షా, ఎస్పీ గౌస్ ఆలం లు సందర్శించారు. కడెం ,ఖానాపూర్, సిర్పూర్ యు, జై నూర్, గాదిగూడ, నార్నూర్ తదితర మండలాల్లో అనేక చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

ముంపు బాధిత కుటుంబాల తరలింపు.. రిహాబిలిటేషన్ సెంటర్లలో పునరావాసం

భారీ వర్షాల నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ముంపు బాధిత గ్రామాల కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు నిర్మల్ జిల్లాలోని బైంసాలో రెండు చోట్ల నిర్మల్ జిల్లా కేంద్రంలో రెండు చోట్ల కడెం మండల కేంద్రంలో మూడు చోట్ల సారంగాపూర్ మండలం లో రెండు చోట్ల పునరావస కేంద్రాలను ఏర్పాటు చేసి వరద ముంపుకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి అక్కడి కుటుంబాలను ఆయా సెంటర్లకు తరలించారు అక్కడే వారికి భోజన వసతి తో పాటు పునరావాసం కల్పిస్తున్నారు. రియాబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేసి ఒక్కో సెంటర్ కు ప్రత్యేక అధికారిని నియమించి వరద ప్రభావం తగ్గే వరకు వారికి బాధ్యతలు అప్పగించారు వరద ముప్పు పూర్తిగా తొలగిన తర్వాతనే ఆ కుటుంబాలను ఆయా గ్రామాలకు పట్టణ ప్రాంతాల్లోని కాలనీలకు తరలించాలని నిర్ణయం తీసుకున్నారు.

కాగా నిర్మల్ పట్టణంలోని జిఎన్ఆర్ కాలనీ గతంలో పూర్తిగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నిర్మల్ చేరుకొని కుటుంబాలను రక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఆ కాలనీ ప్రజలను ముందస్తుగా ఒక రోజు ముందే పునరావాస కేంద్రాలకు తరలించారు. తమ కాలనీ సమస్యను ఎవరు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తూ హరీష్ అనే యువకుడు నివాస భవనం పైనుంచి కిందికి దూకాడు ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ప్రాంతాన్ని కలెక్టర్ అభిలాష అభినవ్ సహా పలువురు ప్రజాప్రతినిధులు సందర్శించారు.

ప్రత్యేక శిబిరాలు.. ఆరోగ్య క్యాంపులు

ఉమ్మడి జిల్లాలో వరద బీభత్సం పెరుగుతుండడంతో మంగళవారం కూడా ఆయా జిల్లాల కలెక్టర్లు పాఠశాలలకు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. బుధవారం కూడా సెలవు కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు వరదల కారణంగా వాహనాలు అంబులెన్సులు వెళ్లలేని గ్రామాలను గుర్తించి ఆయా గ్రామాల్లో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారిని నిండు గర్భిణీలను హృద్రోగా సమస్యలు ఎదుర్కొంటున్న వారిని డయాలసిస్ బాధితులను ముందుగానే ఆయా గ్రామాల నుంచి ఆసుపత్రులకు తరలించారు. మరోవైపు పునరవాస కేంద్రాలతో పాటు వరదలు పోటెత్తిన గ్రామాల్లో ముందస్తుగా ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి మందులు పంపిణీ చేస్తున్నారు. 24 గంటలు ఆరోగ్య శిబిరాల నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు.


Similar News