దిశ ప్రతినిధి, నిర్మల్: సీఎం కేసీఆర్ సారధ్యంలోని తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదని.. ఆయన చలవతోనే దేశంలో అగ్రగామి రాష్ట్రంగా నిలిచామని అడవి శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదివారం నిర్మల్ జిల్లా లక్ష్మణ చందా మండలంలో భారత్ రాష్ట్ర సమితి పార్టీ నేతలు కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం లో ఆయన హాజరై మాట్లాడారు. సాగునీటి ప్రాజెక్టులు నిరంతర విద్యుత్ అందజేయడంలో దేశంలోనే ముందున్నామన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ముఖ్యంగా ఆసరా పెన్షన్లు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వంటి పథకాలు దేశంలో మరెక్కడ లేవని పేర్కొన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి నమూనాను ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయని.. చివరకు బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా తెలంగాణ దారిలోనే నడుస్తున్నాయని పేర్కొన్నారు.
కేంద్రం చర్యలను తిప్పి కొట్టాలి..
ప్రజాస్వామిక భారత్ ఆకాంక్షకు విరుద్ధంగా కేంద్రం నడుస్తున్నదని, ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ స్వతంత్ర సంస్థలను తన గుప్పిట్లోకి తీసుకుని ఇస్తారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఇంద్రకరణ్ రెడ్డి ఆరోపించారు. తన మాట వినని రాష్ట్రాలను టార్గెట్ చేస్తూ.. ఐటీ, ఈడీ సీబీఐ దాడులు చేస్తున్నారని విమర్శించారు. అలాంటి దాడులను దేశ ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. బీజేపీ నేతలు ఎన్నో రకాల అక్రమాలకు పాల్పడుతున్న వారిని వదిలిపెడుతున్న కేంద్రం ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేస్తున్నదని విమర్శించారు.
భారత్ రాష్ట్ర సమితి నేతలు కార్యకర్తలు కలిసికట్టుగా కేంద్రం చర్యలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపుకు నేతలు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, రైతుబంధు సమితి చైర్మన్ వెంకట్ రామ్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, ఎంపీపీ పద్మ, జెడ్పిటిసి సభ్యులు రాజేశ్వర్, నాయకులు అల్లోల సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.