ఇసుక మాఫియా పై ఉక్కుపాదం..

నిర్మల్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి జిల్లా కలెక్టర్ కఠిన చర్యలకు నిర్ణయం తీసుకున్నారు.

Update: 2024-12-23 02:34 GMT

దిశ ప్రతినిధి, నిర్మల్ : నిర్మల్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి జిల్లా కలెక్టర్ కఠిన చర్యలకు నిర్ణయం తీసుకున్నారు. విచ్చలవిడిగా వాగులు, వంకల నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న సమాచారం మేరకు కలెక్టర్ అభిలాష అభినవ్ సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులతో అత్యవసరంగా సమావేశం నిర్వహించి వారికి అక్రమ రవాణా నిరోధంపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇక పై తాను ఇసుక రవాణా పై ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకుంటానని కలెక్టర్ ఆదేశించడంతో అటు అధికారులతో పాటు ఇటు అక్రమ ఇసుక రవాణా చేసే వ్యాపారుల్లో వణుకు మొదలైంది. నిర్మల్ జిల్లాలో ప్రధానంగా గోదావరి విస్తరించి ఉన్న పరివాహక ప్రాంతంలో ఇసుక తవ్వకాలు నిరంతరం సాగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు జిల్లాలో ప్రధాన ఇసుక వనరుగా పేరున్న స్వర్ణ వాగు తో పాటు ఖానాపూర్ నియోజకవర్గంలోని పలికేరు వాగు, కడెం వాగులపై నిఘా పెంచాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు అందాయి.

సీసీ కెమెరాలతో నిఘా..!

అక్రమ ఇసుక రవాణా పై అధికార యంత్రాంగం కఠినంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. భూగర్భ జలాలు, మైనింగ్ పంచాయతీ, రెవెన్యూ, పోలీసు, నీటిపారుదల శాఖ సమన్వయంతో ఇసుక రవాణాపై కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్ ఆదేశం మేరకు ప్రధాన శాఖలు ఇకపై నిరంతర నిఘాను పెంచనున్నాయి. పెద్ద మొత్తంలో ఇసుక లభ్యత ఉన్న వాగులతో పాటు చిన్న చిన్న వాగులు వంకల వద్ద కూడా సీసీ కెమెరాల ఏర్పాటుతో నిఘా పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇళ్ళ నిర్మాణాలకు సంబంధించి ఇసుక అవసరం ఉంటే పంచాయతీ కార్యదర్శుల ద్వారా కచ్చితంగా అనుమతి పత్రాలు కలిగి ఉండాలన్న నిబంధనలు కూడా కలెక్టర్ పెట్టారు.

గత కొంతకాలంగా ఇసుక అక్రమ రవాణాపై ఆధారపడి వ్యాపారం చేస్తున్న కొంతమంది గుట్టుచప్పుడు కాకుండా వాగులో నుంచి ఇసుక తోడడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. మరోవైపు వాగుల్లో నీరు పెద్ద మొత్తంలో ఉన్నప్పటికీ జాలర్ల సహాయంతో వాగు లోపల నుంచి ఇసుకతోడి అధిక ధరలతో వ్యాపారం కొనసాగించారు. ప్రధానంగా స్వర్ణ వాగు అక్రమ ఇసుక వ్యాపారులకు వరంగా ఉంది. ఈ అక్రమ వ్యాపారం పై అనేక ఫిర్యాదులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ కు అందిన ఫిర్యాదుల మేరకు ఆమె అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఇసుక తవ్వకాలకు అనుమతి వచ్చేవరకు ఎవరు కూడా అక్రమంగా ఇసుక రవాణా చేసినా కఠిన చర్యలతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఆదేశించడంతో అక్రమార్కుల్లో గుబులు మొదలైంది మరోవైపు ఇసుక అక్రమ రవాణా చేసే వాహనాలను సీజ్ చేసే అధికారాన్ని కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులకు అప్పగించారు.

అక్రమ రవాణా నియంత్రణకు కఠిన చర్యలు..

ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ తో కలిసి ఆమె రెవెన్యూ, భూగర్భ జల, మైనింగ్ శాఖల అధికారులతో రెండు రోజుల క్రితం సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో నిర్మూలించేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్దేశించిన ప్రాంతాలలోనే రాయల్టీ రుసుము చెల్లించి ఇసుక తవ్వకాలు చేపట్టాలని తెలిపారు. జిల్లాలోని వాగులు, నది పరివాహక ఇసుక తవ్వకాల ప్రాంతాలను గుర్తించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

తహసీల్దార్లు ఇసుక అక్రమ రవాణాపై నిరంతరం పర్యవేక్షణ ఉంచాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నూతన ఇండ్ల నిర్మాణ అనుమతులు పంచాయతీ కార్యదర్శుల ద్వారా మంజూరు చేసి ఆ నిర్మాణాలకు అవసరమగు ఇసుకకు పంచాయతీ కార్యదర్శుల ద్వారా అనుమతులు ఇప్పించాలన్నారు. ఇసుక అక్రమంగా రవాణా చేసినా, నిల్వ ఉంచినా వెంటనే చట్ట ప్రకారం జరిమానాలు విధించడం, కేసులు నమోదు చేయడం, వాహనాలను జప్తు చేయాలన్నారు. అధికారులంతా ఇసుక అక్రమ రవాణాపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. రెవెన్యూ అధికారులు పోలీసు శాఖ వారి సమన్వయంతో ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని తెలిపారు. ఇసుకతో పాటు మొరం అక్రమ రవాణా నూ పూర్తిస్థాయిలో నిర్మూలించాలని ఆదేశించారు. దీంతో అక్రమ మైనింగ్ చేసే ఇసుక, మొరం వ్యాపారుల్లో కలవరం మొదలైంది.


Similar News