దిశ, కడెం : జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలో సోమవారం రాత్రి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ లతో కలిసి కడెం ప్రాజెక్టును పరిశీలించారు. ప్రాజెక్టులోని వరద నీరు ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో వివరాలను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వర్షాల కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. జిల్లాలోని ఖానాపూర్, దస్తురాబాద్, పెంబి మండలాలలో అధిక వర్షపాతం నమోదు అయినందున నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకుతరలించాలని సూచించారు.
జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల వలన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ మంత్రికి వివరించారు. కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అవసరమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. చెరువులో వాగుల సమీపంలోకి ప్రజలు వెళ్లకుండా రెవెన్యూ, పోలీస్ అధికారులను అప్రమత్తం చేయడం జరిగిందని తెలిపారు. రోడ్లపై వాగులు ప్రవహిస్తున్న చోట్ల బారికేడ్ లు ఏర్పాటు చేసి ప్రజలు, వాహనాలు వెళ్లకుండా జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ హైమద్, కిషోర్ కుమార్, డి ఆర్ ఓ భుజంగరావు, ఆర్డిఓ లు రత్న కళ్యాణి, కోమల్ రెడ్డి, డిఎస్పి గంగారెడ్డి, పోలీసు రెవెన్యూ నీటిపారుదల శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.