స్పెషల్ మిఠాయి ‘గేవర’ కి భలే గిరాకీ..!

ఆంధ్ర పూతరేకులు, కాకినాడ కాజా ఎంతప్రత్యేకమో.!

Update: 2024-12-31 04:50 GMT

దిశ,భైంసా : ఆంధ్ర పూతరేకులు, కాకినాడ కాజా ఎంతప్రత్యేకమో.! న్యూ ఇయర్,సంక్రాంతి పండుగల సీజన్లో భైంసా పట్టణంలో గేవర మిఠాయి అంత ప్రత్యేకం.తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా కనిపించని రాజస్థానీ రకం స్వీట్ గేవర కేవలం భైంసా పట్టణంలో ప్రతి సంక్రాంతికి తయారై సందడి చేస్తుంది. తాలూకాలో న్యూ ఇయర్,సంక్రాంతి వచ్చిందంటే చాలు ఈ స్వీట్ తిననివారు ఉండరు. సంక్రాంతి రోజు ఈ స్వీట్ (గేవర) తినడం కాలక్రమంగా రివాజ్ అయిపోయింది.గత కొన్ని దశాబ్దాలుగా రాజస్థానీలు బైంసాలో స్థిరపడి ఉండడంతో ఇక్కడి వారికి ఈ మిఠాయి పరిచయం చేశారు.మైదాపిండి, వనస్పతి, పాలు, నెయ్యి, చక్కెరతో తయారయ్యే ఈ మిఠాయిని దాదాపు 45 సంవత్సరాల కిందట భైంసా పట్టణ ప్రజలకు పరిచయం అయింది.

కేవలం సంక్రాంతి పండగ సీజన్లోనే ఈ రకం స్వీట్ దొరుకుతుంది. ఇక్కడ తయారు చేసే గేవర తెలంగాణ పలు జిల్లాలు, దేశ పలు రాష్ట్రాలు, అమెరికా, దుబాయ్ లాంటి దేశాలకు సైతం ఇష్టంగా తీసుకెళ్తారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ స్వీట్ కి మలాయి కలిపి మాలాయి గెవరను సైతం తయారు చేస్తున్నారు. ఇక్కడి ప్రజలకు ప్రస్తుతం ఈ స్వీటు న్యూ ఇయర్, సంక్రాంతి పండగ రోజు కచ్చితంగా తినాలి అన్నంత ఆనవాయితీ అయిపోయింది.ప్రస్తుతం ఈ మిఠాయి లను నిర్మల్ జిల్లా కి ఆనుకొని వున్న నిజామాబాద్ లో సైతం తయారు చేస్తున్నారు.


Similar News