గిరిజన ఆశ్రమ గురుకుల పాఠశాల విద్యార్థుల పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గల ఆశ్రమ పాఠశాలలు , గురుకులాలలోని విద్యార్థుల పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ రాజార్షి షా అధికారులను ఆదేశించారు.

Update: 2024-03-12 13:03 GMT

దిశ, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గల ఆశ్రమ పాఠశాలలు , గురుకులాలలోని విద్యార్థుల పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ రాజార్షి షా అధికారులను ఆదేశించారు. మంగళవారం సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఐటీడీఏ పీఓ కుష్బూ గుప్తతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…. ఆదిలాబాద్ జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలతో పాటు గిరిజన గురుకులాల్లో చదువుకుంటున్న విద్యార్థుల ఆరోగ్యం, తాగునీటి వసతి, నాణ్యమైన బియ్యం వండటం, ఇతర ఆహార పదార్థాల నాణ్యత పై జిల్లాలోని అన్ని ఆశ్రమ పాఠశాలల , గురుకులాల ప్రధానోపాధ్యాయులు, వసతి గృహ సంక్షేమ అధికారులు దృష్టి సారించాలన్నారు. జిల్లాలో గల అన్ని ఐటీడీఎ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో, గురుకుల పాఠశాలలో కావలసిన అవసరమైన మౌలిక సదుపాయాల పై ప్రతి పాఠశాలకు సంబంధించిన వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.

తాగునీటిని, మిషన్ భగీరథ ద్వారా సరఫరా చేయాలని, ఆర్వో ప్లాంట్స్ రిపేర్ ఉంటే వెంటనే మరమ్మతులు చేపట్టాలని, ఎక్కడా కూడా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఎప్పటికప్పుడు వారి ఆరోగ్యంపై ఆరా తీయాలని, ప్రతి గురువారం పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్స్ ఫీల్డ్ విజిట్ చేయాలని, అనారోగ్యం, ఎనీమియాతో బాధపడుతున్న వారిని గుర్తించి వైద్యం అందించాలని అన్నారు. ప్రతి మొదటి గురువారం ఒక స్కూల్ పర్యటించి మినిమం విద్యార్థులను పరీక్షించి మిగిలిన విద్యార్థులను మరుసటి గురువారం పరీక్షించాలని తెలిపారు. షెడ్యూల్ తయారు చేసుకొని ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలని ఆదేశించారు. అలాగే 5 పీహెచ్‌సీలలో ఏర్పాటు చేసిన ఆరోగ్య మహిళా కేంద్రాలు ప్రతి మంగళవారం క్యాంపులు నిర్వహించి ఆరోగ్య కార్డులు అందించాలని అన్నారు. ఆహార విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి నాణ్యమైన ఆహారాన్ని అందించాలన్నారు. సివిల్ సప్లై ద్వారా సరఫరా చేస్తున్న ఫ్యూరిఫైడ్ బలవర్ధకమైన బియ్యాన్ని వృథా కాకుండా పదిహేను నిమిషాలు బియ్యం నానబెట్టడం వల్ల పైన తేలుతున్న బియ్యం కలసి పోతాయని, దీనివల్ల మంచి పోషకాలు అందుతాయని వివరించారు. ఈ సందర్భంగా సివిల్ సప్లై శాఖ నుండి స్కూల్‌లో శిక్షణ ఇవ్వాలని ఇందులో అందరూ పాల్గొనేలా చూడాలనీ ఆన్నారు.

ప్రతి హాస్టల్‌లో త్రాగునీరు, ఆరోగ్యం, ఆహార విషయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు పాటించాలని, నాణ్యమైన సరుకులు అందించాలని కోరారు. పెండింగ్ పనులు, మరమ్మత్తులు వంటివి ఏమైనా ఉంటే ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో సివిల్ సప్లై, ఐటీడీఏ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.


Similar News