ప్రభుత్వ భూమిలో మట్టి దొంగలు.. పట్టించుకోని రెవెన్యూ, మైనింగ్ అధికారులు

ప్రభుత్వ భూములలో మట్టిని తవ్వుతూ మట్టి దొంగలు యథేచ్ఛగా నిత్యం మట్టి దందా కొనసాగిస్తున్నారు.

Update: 2024-10-06 05:17 GMT

దిశ, ఖానాపూర్ : ప్రభుత్వ భూములలో మట్టిని తవ్వుతూ మట్టి దొంగలు యథేచ్ఛగా నిత్యం మట్టి దందా కొనసాగిస్తున్నారు. అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరించడమే మొరం మాఫియాకు కలిసి వచ్చినట్లుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి రోజు రాత్రి, పగలు బహిరంగానే తవ్వకాలు జరుపుతూ టిప్పర్లతో మట్టి తరలిస్తూ అడ్డదారిలో దర్జాగా సంపాదిస్తున్నారు అని పట్టణవాసులు అంటున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో ఉన్న డబుల్ బెడ్‌రూమ్స్ ప్రక్కన ఉన్న ప్రభుత్వ భూమిలో మట్టి తవ్వకాలు కొనసాగుతున్న పట్టించుకునే నాథుడే లేక మొరం దందా యథేచ్ఛగా కొనసాగుతుంది. సాధారణంగా మట్టి తవ్వకాలకు మైనింగ్ అనుమతులు తీసుకోవాలి కానీ, ఇక్కడ మాత్రం ప్రభుత్వ అనుమతులు లేకుండా దర్జాగా మొరం దందా యథేచ్ఛగా జరుగుతున్నా కూడా అధికారులు మాత్రం తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నట్లు పట్టణవాసులు వెలిబుచ్చుతున్నారు.

*ప్రభుత్వ భూమిలో యథేచ్ఛగా మొరం దందా

జిల్లాలోని ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఓ సర్వే నెంబర్‌లో ఉన్న ప్రభుత్వ భూమిలో రాత్రి, పగలు అనకుండా యథేచ్ఛగా మొరం తవ్వకాలు జరుగుతున్నాయి. అలాగే నిర్మల్, మంచిర్యాల రహదారి పక్కనే ఉన్న డబుల్ బెడ్ రూంల పక్కన తవ్వకాలు జరుగుతున్నా కూడా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. అయితే పలువురు అధికారులకు ఫిర్యాదు చేసిన వారు పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ భూముల నుండి టిప్పర్లతో లక్షల రూపాయల మొరంను తరలించడం, అధికారులు పట్టించుకోకుండా వుండడంతో పట్టణ ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా తవ్వకాల వద్దకు ఎవరైనా వస్తే తెలుసుకొనడానికి మొరం మాఫియా సి సి కెమెరాలలు అమర్చారు.

*పట్టించుకోని రెవెన్యూ, మైనింగ్ అధికారులు

ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలో అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా ఇంత పెద్ద ఎత్తున మట్టి మొరం మాఫియా జరుగుతున్న రెవెన్యూ అధికారులు, మైనింగ్ అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. గత వారం రోజుల క్రితం ఖానాపూర్ తాసిల్దార్ మొరం తీస్తున్న ప్రాంతాన్ని పరిశీలించి టిప్పర్లను, ట్రాక్టర్‌లను సీజ్ చేసినట్లుగా చెబుతున్నా, కానీ యథేచ్ఛగా మొరం దందా కొనసాగుతోంది. ఇక ఈ దందాలో నాయకుల ప్రమేయం ఉందంటూ సోషల్ మీడియాలో రావడంతో ఖానాపూర్‌కు చెందిన మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దోనికేని దయానంద్, కాంగ్రెస్ నాయకులు నిమ్మల రమేష్, షబ్బీర్ పాషా తదితరులు మొరం తవ్విన ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్, కాంగ్రెస్ నాయకులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.


Similar News